వింత ఆచారం… గ్రామంపై మమ’కారం‘…
పూజారికి ‘108 కిలోల కారం నీళ్ల‘ స్నానం.
ఊరి బాగుకోసం ఒక్కడు!!.
అమావాస్య రోజు కొనసాగుతున్న ఆచారం…
ఒక పూజారి ఏకంగా 108 కేజీల కారం కలిపిన నీళ్లతో స్నానం చేశారు. అంటే భక్తులు చేయించారు… అదీ భక్తితో కూడిన నమ్మకంతో. ఆదివారం అమావాస్య నేపథ్యంలో తమిళనాడులోని ఒక గ్రామంలో వినూత్నంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ధర్మపురి జిల్లాలోని నడపనహళ్లి గ్రామంలో ప్రతి ఏటా ఆది అమావాస్య రోజున సామూహిక వేడుకలు జరుగుతాయి. గ్రామ దైవం పెరియ కరుప్పసామికి పాలు,కారంపొడితో అభిషేకం చేస్తారు. భక్తులు మద్యం, సిగరెట్లు కూడా దేవుడికి సమర్పిస్తారు.
ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఆచారం, సాంప్రదాయం ఉంటుంది. కొన్ని ఆచారాలు సాధారణంగా ఉన్నా.. మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాలకు వస్తే తమిళనాడులో మూఢ నమ్మకాలు, ఆచారాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఊరి బాగు కోసం పూజారికి కారం నీళ్లతో స్నానం చేయించే వింత ఆచారం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. గ్రామ దైవానికి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించే పూజారి గోవిందం రెండు కొడవళ్లపై నిలబడి భక్తుల సమస్యలను వింటారు. ఆ తర్వాత ‘కారం యజ్ఞం’లో ఆయన పాల్గొంటారు.
కొడవలి పట్టుకుని కూర్చొనే ఆయనపై 108 కేజీల కారం కలిపిన నీళ్లను భక్తులు తలపై నుంచి పోసి అభిషేకం చేస్తారు. ఇలా చేయడం వల్ల తమలో దుష్టశక్తులు, దురదృష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇలా చేయడం వల్ల తమలోని దుష్టశక్తులు, దురదృష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. భక్తులు కారం నీళ్లు పోసేంత వరకు పూజారి గోవిందం కదలకుండా మెదలకుండా ఉండటం విశేషం.
పూజారి శరీరంపై కారం మరకలు పోయేంత వరకు లీటర్ల కొద్దీ మంచినీళ్లను భక్తులు ఆయనపై గుమ్మరిస్తారు. ఏకంగా 108 కిలోల కారం కలిపిన నీళ్లు గుమ్మరించినా పూజారి ఎలాంటి చలనం లేకుండా ఉండటం మాత్రం విశేషంగా చెప్పకోవాలి.