శృంగారం నిరాకరించే భార్యలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కారణం లేకుండా భర్తతో శృంగారాన్ని తిరస్కరించడాన్ని తప్పు బట్టింది.
గిల్లితే గిల్లిచ్చుకోవాలి, మాట్లాడకూడదు అనే రోజులు ఇప్పుడు లేవు. ఇప్పుడు మహిళలకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. వారికి మనసు ఉంటుంది, ఆ మనసుకు కూడా కొన్ని ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి కాబట్టి కోర్టులు కూడా వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నాయి. అయితే దీన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. శృంగారం అనేది ఒక కోరిక. ఆకలి, నిద్ర ఎలాగో ఇది కూడా మనిషికి అవసరం. దీని కోసం కొంతమంది సహజీవనం చేస్తారు, కొంతమంది పెళ్లి చేసుకుంటారు. కేవలం దీని కోసమే కాదు కానీ పెళ్లి చేసుకుంటే మిగతా ప్రయోజనాలతో పాటు శృంగారం అనేది అదనంగా యాడ్ అవుతుంది. అయితే కొంతమంది అమ్మాయిలకు శృంగారం ఇష్టం ఉండదో, లేక భర్తతో శృంగారం ఇష్టం ఉండదో తెలియదు కానీ కట్టుకున్న భర్తతో కాపురం చేయరు. కనీసం చేయి కూడా వేయనివ్వరు.
నిజానికి అమ్మాయికి ఇష్టం లేకుండా ఆమె మీద కట్టుకున్న భర్త అయినా సరే చేయి వేయకూడదు అని, అలా చేస్తే అత్యాచారమే అవుతుందని గతంలో కోర్టు వెల్లడించింది. మరి అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవడం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భార్య వద్దంటే వేరే మహిళల దగ్గరకు వెళ్లేవారు ఉండవచ్చు కానీ భార్యను తప్ప వేరే మహిళతో శృంగారాన్ని చేయడానికి ఇష్టపడని నికార్సైన భర్తలు కొంతమంది ఉంటారు. అలాంటి వారి పరిస్థితి ఏంటి? పోనీ భార్యకు విడాకులు ఇచ్సి రెండో పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోరు. విడాకుల కోసం అప్లై చేస్తే తిరిగి ఇష్టం లేదని అంటారు. ఇలాంటి కేసునే అలహాబాద్ హైకోర్టు విచారించింది.
తన భార్యతో విడాకులు ఇప్పించమని కోర్టు మెట్లెక్కిన ఓ వ్యక్తి పిటిషన్ ను ఫ్యామిలీ హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆ వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాడు. అయితే హైకోర్టు ఆ వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు భాగస్వామితో శృంగారం నిరాకరించిన భార్యపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భాగస్వామితో శృంగారం నిరాకరించడం మానసిక క్రూరత్వం అవుతుందని వెల్లడించింది. జడ్జీలు జస్టిస్ సునీత్ కుమార్, జస్టిస్ రాజేంద్ర కుమార్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసుని విచారించింది. ఫ్యామిలీ కోర్టు అనుసరించిన విధానాన్ని హైపర్ టెక్నికల్ గా బెంచ్ పేర్కొంది. భాగస్వామితో లైంగిక సంపర్కాన్ని సుదీర్ఘ కాలం పాటు కారణం లేకుండా నిరాకరించడం మానసిక క్రూరత్వం అవుతుందని తెలిపింది.
ఆమె భార్య, అతను గత ఏడేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. సుదీర్ఘ కాలంగా దంపతులిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారని, దీన్ని బట్టి భార్యకు వైవాహిక బంధం పట్ల గౌరవం అనేది లేదని కోర్టు వెల్లడించింది. వైవాహిక బాధ్యతను నిర్వర్తించడాన్ని ఆమె ఖండించిందని కోర్టు తెలిపింది. వీరి వివాహ బంధం పూర్తిగా విచ్చిన్నమైందని కోర్టు గమనించింది. పెళ్ళైన కొన్ని రోజులకే భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి తనను తన ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నానని కానీ తన భార్య రావడం లేదని, తనతో శారీరక సంబంధానికి నిరాకరిస్తూ వచ్చిందని భర్త కోర్టుకు తెలియజేశాడు. అందుకే తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును కోరాడు. భర్త వాదన విన్న తర్వాత హైకోర్టు అతనికి విడాకులు మంజూరు చేసింది.
పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ఇంట్లో చెప్పాలి. అంతేగాని పెళ్లప్పుడు సైలెంట్ గా ఉండి అయ్యాక అతన్ని దూరం పెడుతూ ఒక మగాడ్ని సమాజంలో కామాంధుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయాలని చూసే ఆడవారికి ఈ తీర్పు ఒక చెంప పెట్టు లాంటిది. ఒక మగాడ్ని దూరం పెట్టడం కంటే ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి పెళ్లి కాన్సెప్ట్ నే దూరం పెట్టడం మంచిది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తప్పు ఒక మగాడు చేస్తే ఊరుకుంటారా? మేటర్ లేదని అంటారు. ఒక అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి జీవితం నాశనం చేశారని అంటారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.