అనుకుంటే కానిది ఏమున్నది.. మనిషనుకుంటే కానిది ఏమున్నది.. ఇది ఓ సినిమాలోని పాట. ఈ పాట అక్షర సత్యం. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. ఆగ్రాకు చెందిన దివ్య.
చాలా మంది మొదటి, రెండవ ప్రయత్నంలోనే పోటీ పరీక్షల్లోవిజయం సాధించాలని అనుకుంటూ ఉంటారు. ఓ రెండు ప్రయత్నాల్లో విజయం సాధించలేకపోతే నిరుత్సాహ పడుతుంటారు. కానీ, ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే నిరంతర కృషి ఉండాలి. అలా నిరంతరం కృషి చేసి, తాము అనుకున్నది సాధించుకునే వారు కూడా ఉంటారు. ఈ కోవలో అతి తక్కువ మంది కనిపిస్తారు. నిరంతరం కృషి, పట్టుదల, సాధించాలనే తపన, క్రమశిక్షణ ఉన్న వారిని మాత్రమే విజయం తప్పక వరిస్తుంది. అలాంటి కోవకు చెందిన అమ్మాయే దివ్య సికర్వార్.
ఆగ్రాకు చెందిన దివ్య సికర్వార్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన యువతి. యూట్యూబ్ పాఠాలతో ప్రిపేర్ అయి డిప్యూటీ కలెక్టర్ పదవిని చేరుకున్న సక్సస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. దివ్య సికర్వార్ ది ఆగ్రా సమీపంలోని గర్హి రామి గ్రామం. ఆమెది రైతు కుటుంబం. తండ్రి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉన్నారు. 2022లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన యూపీపీఎస్సీ సీసీఎస్ పరీక్షలో టాపర్ గా నిలిచి, డిప్యూటీ కలెక్టర్ గా సెలెక్ట్ అయ్యింది. ఆమెకు సివిల్స్ సర్వీస్ పై ఆసక్తి కలిగింది.
దీంతో ఆమె మూడుసార్లు యూపీపీఎస్సీ సీసీఎస్ పరీక్ష రాసింది. మూడో ప్రయత్నంలో విజయం చేకూరింది. యూపీపీఎస్సీ సీసీఎస్ 2022 పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించటానికి ఎంతో శ్రమ పడింది. కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడానికి ప్రతిరోజు 8 నుండి 10 గంటల ప్రిపేర్ అయ్యేది. యూట్యూబ్ పాఠాలు, సెల్ఫ్ ప్రిపరేషన్, టైమ్ మేనేజ్ మెంట్ కోసం రైటింగ్ ప్రాక్టీస్ బాగా ఉపయోగపడిందని దివ్య తెలిపింది. యూట్యూబ్ ఛానల్ గైడెన్స్ ఆమె విజయానికి ప్రధానంగా తోడ్పడిందని చెప్పింది.
యూపీపీఎస్సీ సీసీఎస్ పరీక్షలో చివరి రౌండ్ ఇంటర్వ్యు చాలా ప్రధానమైంది. బోర్డు సభ్యులతో ఇంటర్వ్యూ సమయంలో ఆమె చూపిన కాన్ఫిడెన్స్ విజయానికి తోడైంది. గ్రామీణ ప్రాంతాల అమ్మాయిలు తమకున్న అడ్డంకులను అధిగమించి కృషి, అంకితభావం, పట్టుదలతో కోరుకున్నది సాధించగలరని దివ్య చెబుతోంది. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి తనవంతు సహాయం చేస్తానని అంటోంది. మరి, ఓ రైతు బిడ్డ యూట్యూబ్ పాఠాల ద్వారా డిప్యూటీ కలెక్టర్ అయిన ఈ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.