ప్రముఖ నటి మాన్విత తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న...
ప్రముఖ నటి మాన్విత హరీష్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి సుజాత కమాత్ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆమెకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తూ వస్తున్నారు. అయినప్పటికి ఆమె ఆరోగ్యం మెరుగు పడలేదు. బుధవారం సుజాత ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలోనే ఆమె తుది శ్వాస విడిచారు. తల్లి మరణంపై మాన్విత ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తల్లితో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసి, ‘ఆమె వదిలి వెళ్లిపోయింది’
అని రాసుకొచ్చారు. ఈ విషయం తెలిసిన సినిమా వాళ్లు, ఆమె ఫ్రెండ్స్ సుజాత మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సుజాత అంత్యక్రియలు ఆదివారం జరిగే అవకాశం ఉంది. కాగా, ఏప్రిల్ 13న మాన్విత పుట్టిన రోజు వేడుకలు చాలా సాధారణంగా జరిగాయి. తల్లి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆమె చాలా సింపుల్‌గా బర్త్‌డేను సెలెబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు! కేవలం తల్లి ఆరోగ్యంగా లేదన్న కారణంతోనే వచ్చిన మంచిమంచి సినిమా అవకాశాలను వదులుకున్నారు. దీనిపై గతంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను గత సంవత్సరం నా తల్లికి కిడ్నీ సమస్య అని తెలిసినప్పటినుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆమె అన్ని మర్చిపోయేది.. అడిగిన ప్రశ్నే మళ్లీ అడిగేది. ఆమె తీసుకునే మందులు, ట్రీట్‌మెంట్ కారణంగా ఆమె అలా ప్రవర్తించేది. వయసు ప్రభావం కూడా ఉండి ఉంటుంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. మన తల్లిదండ్రుల వయసు పెరిగే కొద్ది చిన్న పిల్లలు అయిపోతారు. అప్పుడు మనమే వారిని చూసుకోవాలి’’ అని తెలిపారు. ఇక, మాన్విత తొలి సినిమాతోనే కన్నడ నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఇలాంటి సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.