ప్రజల నిత్య జీవనంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. అలాంటి ఆధార్‌లో సవరణకు సంబంధించి కేంద్ర సర్కారు కొత్త నిబంధనలు విధిస్తోంది. అవేంటో తెలుసుకుందాం..
మన దేశంలో అందరికీ తప్పనిసరిగా మారింది ఆధార్ కార్డు. విద్య, వైద్యం, ఉద్యోగం.. ఇలా ఎక్కడైనా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలాంటి దీనికి సంబంధించి కేంద్ర సర్కారు కొత్త నిబంధనలు విధిస్తోంది. కొత్తగా జారీ అయిన మార్గదర్శకాల ప్రకారం ఈ ఆధారాలను పక్కాగా సమర్పించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర సర్కార్లు ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఉండాలని నిబంధన విధించాయి. సంక్షేమ పథకాల మంజూరు, భూముల రిజిస్ట్రేషన్, బ్యాంకు పాస్‌బుక్, ఉపాధి హామీ పనుల కల్పన, భూముల క్రయవిక్రయాలు, విద్యార్థుల చదువులు, స్కాలర్షిప్, పంటల విక్రయాలకు ఆధార్ కార్డు ఉండటం తప్పనిసరిగా మారింది.
ఆధార్ కార్డు విషయంలో గతంలో సులభంగా సవరణలు చేసుకునేందుకు వీలుండేది. ఈ క్రమంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ధ్రువపత్రాలు, వయసును బట్టి కూడా కేటగిరీల వారీగా సమర్పించే డాక్యుమెంట్లలోనూ మార్పులు చేస్తూ ఇటీవల యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. సవరణలో మార్పులు దరఖాస్తు చేసే విధానాన్ని మార్చేసింది. ఆధార్‌ను సవరణ చేసుకునే వారిని వయసుల ప్రకారం మూడు కేటగిరీలుగా విభజించారు. ఐదేళ్లలోపు పిల్లలను మొదటి, 5 నుంచి 18 ఏళ్ల లోపు వయసు వారిని రెండు, 18 ఏళ్లు పైబడిన వయసు వారిని మూడో కేటగిరీగా విభజించారు. వీరికి వేర్వేరుగా దరఖాస్తులను తయారు చేశారు.
ఆధార్ కార్డును ప్రతి పదేళ్లకు ఓసారి పునరుద్ధరించుకోవాలి. అడ్రస్‌ను, స్థానికతను నిర్ధారించుకుంటూ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు కావాల్సిన అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను జత చేయాలి. ఇంతకు ముందు గెజిటెడ్ అధికారితో సంతకం చేయించడం ద్వారా వ్యక్తి పేరు, తండ్రి పేరు, చిరునామా, పుట్టిన తేదీ మార్పు చేసుకునే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్, తహసీల్దారు జారీ చేసే గుర్తింపు పత్రాన్ని చూపించాలి. ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు, బ్యాంక్ పాస్‌బుక్, రేషన్‌కార్డులో సరైన అడ్రస్ ఉంటే వాటితో కూడా సరి చేసుకోవచ్చు. నీటి పన్ను, కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, గ్యాస్ కనెక్షన్ రసీదులను కూడా ఉపయోగించుకోవచ్చు.
ఆధార్ కార్డులో పేరులో మార్పు చేయాలంటే తప్పరిసరిగా ఫొటో ఉన్న ధ్రువపత్రాన్ని సమర్పించాలి. టెన్త్ క్లాస్ మార్కుల జాబితా, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు, ఉపాధి హామీ జాబ్‌కార్డు తదితర ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి జతపర్చాలి. ఉద్యోగులు వారి గుర్తింపు కార్డు, వివాహితులైతే మ్యారేజ్ సర్టిఫికేట్, తహసీల్దారు జారీ చేసిన కుల ధ్రువపత్రం సమర్పించొచ్చు. అదే పుట్టిన తేదీలో మార్పు అయితే.. చిన్నారులకైతే తప్పనిసరిగా మున్సిపల్ లేదా పంచాయతీ నుంచి జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఇది కూడా ఒకసారి మాత్రమే సవరించుకునే వీలును కేంద్ర సర్కారు కల్పించింది. రెండోసారి మార్పు చేసుకోవాలనుకుంటే మాత్రం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి వెళ్లి తగిన వివరణ ఇస్తూ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది.