ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోయాయి. ప్రమాదంలో కాలు కోల్పోయిన యువతి తన జీవితం చీకటి కోణంలోకి నెట్టబడుతుందని డిప్రెషన్ లోకి వెళ్ళింది. నేహ అనే యువతి తనను తాను ప్రోత్సహించుకుని టీ స్టాల్ స్టార్ట్ చేసి తన కలను నెరవేర్చుకుంది.
జీవితంలో అనుకోని ప్రమాదాలు ఎన్నో జరుగుతాయి. కొన్ని ప్రమాదాల్లో జీవితాంతం బాధపడేలా అంగవైకల్యాన్ని పొందుతాం. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా సరే కొన్ని పనులు చేయడానికి ఇతరులపై ఆధారపడతాం. మరి మన శరీరంలో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయితే ఆ పరిస్థితి ఊహించలేం. ప్రమాదంలో కాలు పోగొట్టుకుని, పేరెంట్స్‌కు భారమై, తన జీవితం అంతా శూన్యంలా తోచిన రోజుల నుంచి.. బయటపడి తను అనుకున్న గమ్యాన్ని చేరుకుని అంగవైకల్యాన్ని జయించిన యువతి గాథ తెలుసుకుందాం.
నేహ అనే యువతి గుజరాత్‌లోని భవానీ నగర్‌లో పుట్టి పెరిగింది. వారిది ఉమ్మడి కుటుంబం. ఫ్యామిలీలో అమ్మ,నాన్న, ఇద్దరు అన్నదమ్ములు నేహ ఉండేవారు. తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవారు. దీంతో చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఉద్యోగం చేస్తూనే కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది. ఉదయం జాబ్ చేస్తూ.. సాయంత్రం కాలేజీలో చదువుకొనసాగించింది. తర్వాత 2012 లో అహ్మదాబాద్ వెళ్లి, కాల్ సెంటర్ లో కొద్దిరోజులు పనిచేసింది. మళ్లీ టీచర్ జాబ్ చేస్తూ ఎక్కువ మొత్తంలో జీతం గడించేది. ఇదిలా ఉండగా అనుకోకుండా ఓ రోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నేహ కాలుకు తీవ్రంగా గాయమయింది. సరైన చికిత్స తీసుకోవడం ఆలస్యం అయినందున కాలు తీసేయాల్సి వచ్చింది. దీంతో డిప్రెషన్‌కు గురైంది నేహ. కృత్రిమ కాలు సెట్ చేసిన తర్వాత కొంతకాలానికి కోలుకుంది.
స్నేహితుల సహకారంతో టీ స్టాల్ ప్రారంభించింది. చాలామంది కాలు సరిగాలేదని నిరుత్సాహపరిచారు. అయినా ‘కాళ్లు లేకపోయినా రెక్కలున్నాయి’ కదా! అని తనను తానే ప్రోత్సహించుకుంది. ‘ఆంప్ టీ నేహా’ పేరుతో టీ స్టాల్ స్టార్ట్ చేసింది. ఫుడ్ బ్లాగర్లు నేహ గురించి రాసి ప్రచారం చేశారు. టీ స్టాల్ బ్రాండ్ గురించి వీడియో బాగా వైరల్ అయింది. ‘ఆంప్ టీ నేహా’ని మంచి బ్రాండ్‌గా మార్చి చాలామందికి మార్గం చూపాలన్నది నేహ కల. కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది నేహ. కాలు లేపోయినా కూడా చేతులతో తన కలను నిజం చేసుకున్న నేహ విజయగాథపై మీ కామెంట్స్ తెలియజేయండి.