కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో బిడ్డకు జన్మనిస్తానని తెలిసిన మహిళ సాధారణంగా పుట్టబోయే బిడ్డ గురించి లేదా తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఓ మహిళ మాత్రం అందుకు భిన్నంగా తన చదువు గురించి ఆలోచించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి రోజు గడవక ముందే అంబులెన్సులో వెళ్లి పరీక్షలు రాసింది. ఆమెకు చదువుపై ఉన్న పట్టుదల కొందరికి ఆదర్శంకాగా మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ రాష్ట్రంలోని ఝుంఝును జిల్లాలోని జిరి గ్రామానికి చెందిన లక్ష్మీ కుమారి అనే గర్భిణి జేఎం బీఈడీ కాలేజీలో చదువుతోంది. కాగా ఆమెకు నెలలు నిండే సమయానికి పరీక్షకు దగ్గర పడ్డాయి. ఆమె మొత్తం 9 పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ క్రమంలో మొదటి నాలుగు పరీక్షలు రాసిన అనంతరం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు సూరత్ ఘడ్ లోని సీహెచ్ సీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే లక్ష్మికి ఆ మరుసటి రోజే పరీక్ష ఉంది. కుటుంబ సభ్యులు ఎంత వారించిన తాను పరీక్ష రాయాల్సిందే అని మొండి పట్టు పట్టింది. దీంతో ఆమెలోని పట్టుదలను అర్ధం చేసుకున్న కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో పరీక్ష కేంద్రం వద్దకు తీసుకెళ్లారు.
అక్కడ అబులెన్స్ లోనే లక్ష్మీ.. బీఈడీ పరీక్ష రాసింది. అలా పురిటి నొప్పులు లెక్క చేయకుండా రాత్రివేళ్లలో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేంది. అంబులెన్స్ లో పడుకుని లక్ష్మీ కుమారి మరో పరీక్ష రాసింది. అలా మిగిలిన బీఈడీ పరీక్షలు పూర్తి చేసింది. లక్ష్మీ కుమారి భర్త శ్యామ్‌లాల్ .. దీని కోసం పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ రవిశర్మతో మాట్లాడి అనుమతి తీసుకున్నారు. కాగా, లక్ష్మీతోపాటు మరో ఇద్దరు కూడా ఇలానే పరీక్షలకు హాజరయ్యారు. సోను శర్మ, సరిత అనే ఇద్దరు మహిళలకు కూడా ఈ కేంద్రంలో పరీక్షలు రాశారు. వీరికున్న పట్టుదలకు హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి.. ఈ మహిళపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.