దేశంలో శాస్త్ర, సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సాధ్యం కాదూ అనే పదం వినిపించదేమో అనిపిస్తోంది. ఆకాశాన్ని కిందకు అయితే దించలేము కానీ.. అసాధ్యం కాదూ అనుకున్న కొన్ని పనులను సుసాధ్యం చేయొచ్చు అని మాత్రం సైన్స్ నిరూపిస్తోంది. అందుకు ఉదాహరణ మనం చెప్పుకునే ఓ సంఘటన. ఇప్పటి వరకు మహిళలు మాత్రమే గర్భం దాల్చారు. పురిటి నొప్పులు, బిడ్డను జన్మనివ్వడం వారికి మాత్రమే దక్కిన అరుదైన వరం. కానీ ఆ వరాన్ని పొందనున్నారూ ఓ ట్రాన్స్ మెన్. బహుశా దేశంలో ఓ ట్రాన్స్ పర్సన్ గర్భం దాల్చడం తొలిది కావొచ్చు.
కేరళలోని కోజికోడ్ లో నివసిస్తుంది జహద్, జియా పావల్ అనే లింగమార్పిడి జంట. మరి కొన్ని రోజుల్లో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. వచ్చే నెలలో జహద్ కు బిడ్డ పుట్టబోతున్నాడు. ఈ విషయాన్ని వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జహద్, జియా పావల్ మూడేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. ‘నేను పుట్టుకతో లేదా నా శరీరం ద్వారా స్త్రీని కానప్పటికీ, అమ్మా అని పిలుపు కోసం నేను కన్న కలలు నెరవేరబోతున్నాయి. కాలం మనల్నికలిపి మూడు సంవత్సరాలు అయింది. తల్లి, తండ్రి (జహద్) కావాలన్ననా కోరిక.. ఎనిమిది నెలల పసికందు రూపంలో అతడి కడుపులో కదులుతోంది’అని జియా ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొంది.
జియా పురుషుడిగా పుట్టి స్త్రీగా మారగా, జహాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారాడు. అయితే శిశువు కోసం జహాద్ తన గర్భాశయాన్ని తొలగించుకోలేదు. కాగా, జియా నృత్యకళాకారిణిగా రాణిస్తున్నారు. జహాద్ గర్భం దాల్చిన ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన జియా , బహుశా ఓ లింగ మార్పిడి జరిగిన పురుషుడు గర్భం దాల్చడం దేశంలో మొదటిదేమో అని క్యాప్షన్ లో పేర్కొన్నారు. ఈ ఫోటో షేర్ చేసిన నాటి నుండి వీరికి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. మీ ప్రేమకు హద్దులు లేవని, ఈ హ్యాపీ న్యూస్ తనకు ఆనందాన్నిఇచ్చిందని పలువురు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది హార్ట్ సింబల్స్ జోడిస్తున్నారు. ఈ వార్త కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. ట్రాన్స్ మెన్ గర్భం దాల్చడంపై మీరెమనుకుంటున్నారో.. అభిప్రాయాన్నికామెంట్ల రూపంలో తెలియజేయండి.