సూరజ్ తాను కలలు గన్న దానికోసం ఎంతో కష్టపడుతున్నాడు. నిత్యం మూడు చక్రాల సైకిల్‌పై తిరుగుతూ సమోసాలు అమ్ముతూ ఉన్నాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘అనుకుంటే కానిది ఏమున్నది.. మనిషనుకుంటే కానిది ఏమున్నది’ అని ఓ సినిమాలో పాట ఉంది. ఆ పాట అక్షర సత్యం. మనం మనస్పూర్తిగా ఏదైనా అనుకుంటే అది కచ్చితంగా జరుగుతుంది. మన పని కోసం పంచభూతాలు సహకరిస్తాయి. కన్న కలలు నిజం చేసుకోవటానికి మన శారీరక లోపాలు ఏమాత్రం అడ్డుకాదు.. దృఢమైన సంకల్పం ఉంటే చాలు. ఈ విషయాన్ని ఎంతో మంది దివ్యాంగులు నిరూపించారు. ఇప్పటికీ తాము అనుకున్నది సాధించటం కోసం తపనపడుతున్న దివ్యాంగులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు.
తాజాగా, ఓ దివ్యాంగుడు తాను ఐఏఎస్ కావాలని కలలుగన్నాడు. అది సాధించటం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. అతడి పట్టుదల దేశం ఈ మూలనుంచి ఆ మూలవరకు ఉన్నవారిని కదిలిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్‌కు చెందిన సూరజ్ అనే వ్యక్తికి చిన్నప్పటినుంచి కాళ్లు సరిగా లేవు. అతడికి ఐఏఎస్ కావాలనే ఓ బలమైన కోరిక ఉంది. అయితే, ఐఏఎస్ కోసం ప్రిపేర్ కావాటానికి అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిపోవటం లేదు. ఏదైనా ఉద్యోగం చేస్తూ ఐఏఎస్‌కు ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు.
నాగ్‌పూర్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అతడికి ఎలాంటి ఉద్యోగం దొరకలేదు. దీంతో సమోసాలు అమ్మటానికి డిసైడ్ అయ్యాడు. ప్లేటు 15 రూపాయల చొప్పున సమోసాలు అమ్మటం మొదలుపెట్టాడు. సాయంత్రం 3 గంటలనుంచి రాత్రి 7 గంటల వరకు నాగ్‌పూర్‌లోని బిజీ ఏరియాల్లో సమోసాలు అమ్ముతూ ఉన్నాడు. మూడు చక్రాల సైకిల్ మీద సమోసాలు అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. యూట్యూబ్‌వాడో అఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఇతడికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. ‘ఐఏఎస్ చదవటం కోసం సమోసాలు అమ్ముతూ ఉన్నాడు.
అతడికి సహాయం చేయండి’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నిజంగా అనుకున్నదాని కోసం అతడు చాలా కష్టపడుతున్నాడు’’..‘‘ ఇతడు చాలా మంది సోమరిపోతులకు స్పూర్తి. అన్నీ ఉన్నా కొందరు ఎలాంటి కష్టం పడకుండా అన్నీ కావాలని అనుకుంటూ ఉంటారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, సమోసాలు అమ్ముతూ ఐఏఎస్‌కోసం కష్టపడుతున్న సూరజ్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.