ఈ కాలంలో మనిషి డబ్బుకు ఇచ్చిన ప్రాధాన్యత సాటి మనుషులకు కూడా ఇవ్వడం లేదు. రోడ్డు పై పదిరూపాయలు కనిపిస్తే చాటు చటుక్కున జేబులో వేసుకుంటారు.. అలాంటిది కొంతమంది వణ్యప్రాణుల కోసం తమ ఆస్తులు రాసిన గొప్ప మనసు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.
ఈ కాలంలో డబ్బు ఎవరికి చేదు.. ఆ డబ్బు కోసం బంధాలు.. బంధుత్వాలు మరిచి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు.. చంపుకుంటున్నారు. కొంతమంది డబ్బు కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. రోడ్డుపై పది రూపాయల నోటు కనిపిస్తే చాలు టక్కున జేబులో వేసుకుంటారు.. అలాంటిది వన్య ప్రాణులపై మక్కువతో కొంతమంది ఆస్తులు రాసి ఇస్తున్నారు. ఆ మద్య మహారాష్ట్రలో ఓ వ్యక్తి కోతుల కోసం ఏకంగా 32 ఏకరాలే రాసి ఇచ్చాడు. కొంతమంది కుక్కలకు తమ ఆస్తులను రాసి ఇస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి తాను ఎంతో ప్రాణంగా చూసుకున్న ఏనుగుకు 5 కోట్ల విలువైన ఆస్తి రాసి ఇచ్చాడు. ఈ ఘటన బీహార్ లో చోటుసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బీహార్ లోని జానిపూర్ కి చెందిన మహమ్మద్ అక్తర్ ఇమామ్ అనే వ్యక్తి కొంతకాలంగా రెండు ఏనుగులను పెంచుకుంటున్నాడు. వాటికి మోతీ, రాణి అని పేర్లు కూడా పెట్టుకున్నాడు. స్వతహాగా వన్యప్రాణి సంరక్షకుడైన మహమ్మద్ ఏనుగులను తన కుటుంబం కన్నా ఎక్కువగా.. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు. మహమ్మద్ ఈ ఏనుగుల సంరక్షణ కోసం ట్రస్ట్ ని కూడా స్థాపించాడు. తాను ఏదైనా ప్రమాదానికి గురై చనిపోతే ఏనుగులను బాధ్యతగా ఎవరు చూసుకుంటారని ఆలోచనతో తన 5 కోట్ల ఆస్తిని ఏనుగుల పేరుమీద రిజిస్టర్ చేసేశాడు. అయితే ఏనుగులకు అంత పెద్ద మొత్తంలో ఆస్తిని రాసివ్వడం ఏంటని ఆశ్చర్యపోయారు.. దీనికి వెనుక ఓ పెద్ధ కథ ఉంది.
ఇటీవల భోజ్ పూర్ కి వెళ్లిన మోతీ అనే ఏనుగుకు అనుకోకుండా జబ్బు చేసింది. వార్త తెలిసిన వెంటనే మహమ్మద్ అక్కడికి చేరుకున్నాడు. ఏనుగు చికిత్స అందించారు.. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న మహమ్మద్ పై కొంతమంది దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మోతీ ఒక్కసారిగా ఘీంకరించడంతో మహమ్మద్ మేల్కొని దుండగుల నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ మోతీ ఘీంకరించకుంటే తన ప్రాణాలు కచ్చితంగా పోయి ఉండేవని భావించిన మహమ్మద్ అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ తాను చనిపోతే ఏనుగులను పరిరక్షించడానికి ఏదైనా చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తన యావత్ ఆస్తిని ఏనుగుల పేరుమీద రాసి ఇచ్చాడు. తనపై హత్యాయత్నం చేసింది ఎవరో కాదు తన సొంత కుటుంబ సభ్యులే మహమ్మద్ ఆరోపించారు.
తనను చంపి తాను ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న మోతీ, రాణీలను అక్రమ రవాణా ముఠాకు అప్పగించాలనే దురాలోచనతో తన కుటుంబ సభ్యులే ఈ పని చేశారని సంచలన ఆరోపణలు చేశాడు మహమ్మద్. కొంత కాలం క్రితం మహమ్మద్ అక్తర్ తన భార్యా, కుమారుడితో విడిపోయి వేరుగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఆస్తి ఏనుగులకు రాసి ఇవ్వడం వారికి నచ్చలేదు.. ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారు. తన కుటుంబం వల్ల ఎప్పటికైనా ప్రమాదం ఉందని భావిస్తూ వచ్చాడు మహమ్మద్ అక్తర్. అతను అనుకున్నదే నిజమైంది.. 2021 లో ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అయితే మహమ్మద్ అక్తర్ రాసిన వీలునామా ప్రకారం ఐదు కోట్ల ఆస్తి ఏనుగులకు దక్కింది.
ఇటీవల మోతీ తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయింది.. ఇక మహమ్మద్ అక్తర్ సంబంధించిన ఐదు కోట్ల ఆస్తికి 25 ఏళ్ల రాణి ఏనుగు ఏకైక వారసురాలు అయ్యింది. ప్రస్తుతం రాణి ఏనుగు బాధ్యత స్థానిక అటవీ అధికారి ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తికి అప్పగించారు. అయితే ఇక్కడే మరో సమస్య వచ్చిపడింది.. రాణి ఏనుగు ఉత్తరాఖాండ్ లోని రామ్ నగర్ లో ఉంటుంది.. అక్తర్ ఆస్తి పాట్నాలో ఉంది. దీంతో మహమ్మద్ స్థాపించిన ఫౌండేషన్ నడుస్తున్నప్పటికీ.. దానికి సరైన నిధులు రావడం లేదని వాపోతున్నారు అధికారులు. అక్తర్ ఆశయం కొనసాగాలంటే.. రాణి పేరున ఉన్న ఆస్తి సద్వినయోగం కావాలని అధికారులు అంటున్నారు.