సోషల్ మీడియాలో పుడుతున్న ప్రేమలను చూస్తుంటే.. నిజంగానే ప్రేమ గుడ్డిదీ అనొచ్చు. ఫేస్ బుక్ , ట్విట్టర్ లేదా ఇన్ స్టా ద్వారా పరిచయమై.. ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకున్నారని విన్నాం. కానీ ఇది కాస్త అప్ డేటెడ్ వర్షన్. ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ప్రేమలో పడ్డారు ఓ జంట.
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడి ఉంటాయనేది నాటి మాట.. కానీ సోషల్ మీడియా ద్వారానే పెళ్లిళ్లు జరుగుతున్నాయన్నదీ నేటి మాట. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలు వచ్చిన తర్వాత.. అందులో పరిచయమై పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కొంత మంది. సోషల్ మీడియాలో ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాంతాలే కాదూ ఖండాతరాలు దాటి వస్తున్నారు. వాస్తవాలను పక్కనపెడితే.. సోషల్ మీడియాలో పుడుతున్న ఈ వ్యవహారాన్ని చూస్తుంటే.. నిజంగానే ప్రేమ గుడ్డిదీ అనొచ్చు. కానీ కొన్ని సార్లు ఇవి పెళ్లి పీటల వరకు వెళతాయి.. కానీ మరికొన్ని సార్లు ఇవి మోసాలని తేలాయి. అంతా సోషల్ మీడియా ద్వారా వివాహం చేసుకుంటుంటే.. తామేమీ తక్కువ తినలేదని నిరూపించిందో జంట. ఆన్ లైన్‌లో ఆడుతూ పాడుతూ ప్రేమలో పడింది.
ఆన్ లైన్‌లో లూడో ఆడుతూ ప్రేమలో పడ్డారు ఉత్తరప్రదేశ్,బీహార్‌కు చెందిన ఇద్దరు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లా తిలక్‌నగర్‌కు చెందిన నందలాల్ కుమార్తె నేహ, బీహార్ గయా జిల్లాకు తికారి బజార్‌కు చెందిన చంద్రశేఖర్ చౌదరీ కుమారుడు పంకజ్ చౌదరీలు ఖాళీ సమయాల్లో ఏం తోచక.. ఆన్ లైన్‌లో లూడో గేమ్ ఆడేవారు. అలా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వీరి ఫోన్ నంబర్లు పంచుకున్నారు. ఆ తర్వాత గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుకునేవారు. అభిప్రాయాలు కూడా కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసిపోయింది. వారు పెళ్లికి నిరాకరించారు.
ఇక అతడిని మర్చిపోలేని నేహా.. ఇంటి నుండి పారిపోవాలని నిర్ణయం తీసుకుంది. చివరకు అతడి వద్దకు వచ్చేసింది. అనంతరం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కూతురు పరారీ విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా బీహార్‌కు వెళ్లగా, పెళ్లి అయిపోయిందని తెలిసింది. దీంతో వారు వెనుదిరిగారు. దీంతో చేసేదేమీ లేక కుమార్తె పెళ్లిని అంగీకరించారు నేహా తల్లిదండ్రులు. ఆ తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న జంట.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఓ గుడిలో దండలు మార్చుకున్నారు. దీంతో ‘లూడో లవ్’ కథ సుఖాంతం అయింది.