నేటికాలంలో చాలామందికి నడి వయస్సు రాగానే ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. దీంతో పనులను చాలా నెమ్మదిగా చేస్తుంటారు. మరికొందరు అసలు పనులు చేయడానికి కూడా ఆరోగ్యం సహకరించదు. ఇక వృద్దుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పక్కవారి సాయం లేనిది వారు అడుగు కూడా ముందుకు వెయ్యలేరు. కానీ 91 ఏళ్ల ఓ పెద్దమనిషి మాత్రం రైల్వే కూలీగా కష్టపడి పనిచేస్తున్నారు. తొమ్మిది పదుల వయస్సులోనూ కుర్రాడిలా పనిచేస్తున్న ఈ వృద్ధుడు ఎందరికో ఆదర్శం. మరి.. ఆయన కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
హర్యానాకు చెందిన 91 ఏళ్ల కిషన్ చంద్ స్థానిక రైల్వే స్టేషన్ లో కూలీగా పనిచేస్తున్నాడు. 15 ఏళ్ల వయసులో పాకిస్థాన్ నుంచి భారత్ కు వచ్చాడు. దేశ విభజన సమయంలో పాక్ నుంచి భారత్ లోని పానీపత్ కు కిషన్ చెంద్ వచ్చారు. ఆ సమయంలో కిషన్ చంద్ కు నిలువ నీడ కూడా లేకపోవడంతో పానిపత్ రైల్వేస్టేషన్ నే నివాసంగా మార్చుకున్నారు. ఆయన 35 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నారు. అతడికి నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. రైల్వే స్టేషన్ లో కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
ప్రస్తుతం పిల్లలుపై ఆధారపడకుండా తన ఖర్చులు తానే వెళ్లదీసుకుంటున్నానని కిషన్ తెలిపారు. ప్రస్తుతం తనకు 91 ఏళ్ల వయస్సు అని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కిషన్ చంద్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తాను భారత్ కి వచ్చిన మొదట్లో ఏం పనిచేయాల్లో అర్ధంకాలేదని, ఆ సమయంలో ఈ రైల్వే స్టేషన్ అమ్మలా ఆదుకుందని ఆయన అన్నారు. స్టేషన్ కు వచ్చిన మొదట్లో దిల్లీ నుంచి వచ్చే రైలు ఇంజిన్ లో బొగ్గు నింపే వాడినని, అప్పుడు తనకు ఒకటి, రెండు అణాలు ఇచ్చేరని తెలిపాడు. అదే బొగ్గును అంబాల వరకు తరలిస్తే ఒక్కరూపాయి ఇచ్చే వారని కిషన్ చంద్ పేర్కొన్నారు.
ప్రస్తుతం రోజుకు రూ.400 వస్తాయని, ఉదయం 8 నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ పనిచేస్తానని కిషన్ తెలిపారు. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఎవరిపై ఆధారపడనని, ప్రభుత్వాలు ఎన్ని మారిన రైల్వేకూలీల బతుకులు మారలేదని కిషన్ చంద్ ఆవేదన వ్యక్తం చేశారు. హరే రామ, హరే కృష్ణ అనుకోవాల్సిన వయస్సులో.. యువకుడిలా ఎంతో హుషారుగా కిషన్ చంద్ పని చేయడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 91 ఏళ్ల వయస్సులోను కష్టపడి పనిచేస్తూ.. తన కాళ్లపై తాను నిలబడుతున్న కిషన్.. ఎందరికో ఆదర్శం. మరి.. ఈ 91 ఏళ్ల కుర్రాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.