పట్టుదలతో కష్టపడి పనిచేసేవారికి తప్పక విజయం లభిస్తుంది. విజయం సాధించాలనే తపనకు వయస్సుకు సంబంధంలేదు. అందుకు నిదర్శనం అనేక మంది వృద్ధులు. చదవుకు,క్రీడలకు వయస్సుతో సంబంధం లేదన్నది చాలా మంది పెద్ద వయస్కులు రుజువు చేశారు. ఓ 71 ఏళ్ల పెద్దాయన అదే విషయాన్ని మరోసారి రుజువు చేశాడు. డిప్లోమాలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. చదువుల తల్లిని మెప్పించి విజయలక్ష్మిని వరించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏమిలేదనుకున్నాడు 71 ఏళ్ల నారాయణ భట్. కర్ణాటకు చెందిన ఈయనకు మొదటి నుంచి చదువు అంటే పిచ్చి. అందుకే శరీరంలో ఒపిక ఉన్నంత వరకు జీవితంలో ఏదో ఒకటి సాధించి..గుర్తింపు పొందాలనే కసి పెట్టుకున్నాడు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా శిరిసి గ్రామానికి చెందిన నారాయణ భట్ 1973లో ప్రభుత్వ పాలీటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అప్పట్లోనే ఈ కోర్సులో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అతడిని జాబ్ వెతుక్కుంటూ వచ్చింది. ఉద్యోగం కోసం గుజరాత్ వెళ్లి..2013లో తిరిగి కర్ణాటకు వచ్చాడు.
చిన్నతనం నుంచి సివిల్ ఇంజనీరింగ్ అంటే నారాయణ భట్ కు చాలా ఇష్టం. ఎలాగైన సివిల్ ఇంజనీరింగ్ పట్టాలను పొంది.. భవనాలను, ప్రాజెక్టలను నిర్మించాలని అనుకున్నాడు. దీంతో సివిల్ ఇంజినీరింగ్ చేయలని భావించిన భట్ ఎంట్రన్ ఎగ్జామ్ రాశాడు. మంచి ర్యాంకుతో స్థానిక కళాశాలలో సివిల్ గ్రూపులో సీటు సంపాదించాడు. అందరి విద్యార్ధుల మాదిరే నారాయణ భట్ ప్రతి రోజూ కూడా తరగతు హాజరయ్యేవారు. యూనిఫామ్ లేకుండా నారాయణ భట్ ఎప్పుడూ కళాశాలకు రాలేదని చెప్పారు. ఏడు పదుల వయస్సులోనూ తోటి విద్యార్ధులతో కలివిడిగా, ఉత్సాహంగా ఉండేవారని అక్కడి వారు తెలిపారు.
ఈక్రమంలో మొదటి ఏడాది పరీక్షలు ఎంతో చక్కగా రాశారు. ఈ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. యువ విద్యార్ధులను దాటేసి..91 శాతం మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. తన విశేషమైన ప్రతిభతో నారాయణ భట్ అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తాడు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 2 సత్కరించనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేతుల మీదుగా భట్ ప్రతిభా అవార్డు అందుకోనున్నాడు.