హర్యానా రాష్ట్రంలోని హతిన్ నగర పరిధిలోని హంచ్‌పురీ గ్రామానికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి చాలా ఏళ్ల క్రితమే పెళ్లయింది. అతడి భార్య నాలుగేళ్ల క్రితమే చనిపోయింది. చక్కగా మనవళ్లు, మనవరాళ్లను ఆడించాల్సిన వయసులో అతడు అతడు 19 ఏళ్ల వయస్సు ఉన్న యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరినీ పక్కపక్కన నిలబెట్టి చూస్తే తాతా మనవరాలు అని అంతా అనుకుంటారు. యువతి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఆ వృద్ధుడు, ఆ యువతి తమకు రక్షణ కల్పించాలంటూ మొదట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. హర్యానా హైకోర్టును ఆశ్రయించారు.
తాతగారికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వాళ్లందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. వ్యవహారంపై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. వారిని వేరు వేరు చోట్ల ఉంచి రక్షణ కల్పించాలని, ఆ వృద్ధుడి గురించి, గతంలో అతడి ప్రవర్తన గురించి ఆరా తీయాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రేమపెళ్లిపై మొదట్లో అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. బెదిరించో, భయపెట్టో ఆ యువతిని ఆ వృద్ధుడు పెళ్లికి ఒప్పించి ఉంటాడని అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో తాను ఇష్టపూర్వకంగానే అతడిని పెళ్లి చేసుకున్నానని సదరు యువతి చెప్పింది.
విచారణకు సంబంధించిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. నూహ్ జిల్లా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి కుటుంబానికి ఆ గ్రామంలో భూతగాదాలు ఉన్నాయి. ఆ కుటుంబంతో ఇతడికి పరిచయం ఉంది. ఆ భూతగాదాను తాను పరిష్కరిస్తానని చెప్పి ఆ కుటుంబంతో కలిసి పోయాడు. ఈ క్రమంలోనే ఆ 19 ఏళ్ల యువతితో చనువు పెంచుకున్నాడు. ఆ యువతికి కూడా అంతకుముందే పెళ్లయింది. భర్తతో గొడవల కారణంగా మళ్లీ పుట్టింటికే వచ్చింది. ఆ వృద్ధుడు ఏం మాయమాటలు చెప్పాడో ఆ యువతి ఏమని భావించిందో ఏమో కానీ ఇద్దరూ కలిసి గుళ్లో పెళ్లి చేసుకున్నారు.
ఆమె స్టేట్‌మెంట్ స్పష్టంగా ఉండడంతో ఈ కేసులో కోర్టు ఏమని తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇద్దరికి వయసు రీత్యా భారీ తేడా ఉన్నా.. ఇద్దరూ మేజర్లే కావడం, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామనడంతో తీర్పు ఎలా వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.