అరగంటపాటు ఏకధాటితో కురిసిన పిడుగుల వానకు ప్రజలు భయపడిపోయారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వేల పిడుగులు పడటంతో జనాలు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఒడిశాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. అరగంట వ్యవధిలోనే వేలాది పిడుగులు పడటంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. భద్రక్ జిల్లా, బాసుదేవపూర్‌లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వేలాది పిడుగులు ఒక్కసారిగా పడటంతో స్థానికులు హడలిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇలా జరుగుతుందని గోపాల్పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం (ఐఎండీ) ఆఫీసర్ ఉమాశంకర్ దాస్ తెలిపారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని ఆయన చెప్పారు. ప్రతి పిడుగుపాటును గుర్తించే అత్యాధునిక టెక్నాలజీ ఇక్కడి రాడార్ కేంద్రానికి ఉందని ఉమాశంకర్ చెప్పుకొచ్చారు.
ఒడిషాలోని సుందర్‌గఢ్, కింఝోర్, మయూర్భంజ్, బాలాసోర్, కటక్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆ టైమ్‌లో బలమైన గాలులు, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద అస్సలు తలదాచుకోవద్దని వాతావరణ శాఖ సూచించింది. మధ్యదరా ప్రాంతంలో ఉష్ణమండల తుఫాను కారణంగా భారత్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని రోజులుగా ద్రోణి ప్రభావంతో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ గురువారం భారీ వర్షం కురిసింది.