ప్రేమ ఎప్పుడు ఎవ్వరి మీద కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. పిల్లల దగ్గరినుంచి ముసలి వారి దగ్గరి వరకు ఎవ్వరైనా.. ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చు. ప్రేమకు ఎవ్వరూ అతీతులు కారు. ఇందుకు తాజా ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ అధికార పార్టీ నేత.. ప్రతిపక్ష పార్టీ నేత కూతురితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆఖరికి ఆమెతో ఊరు విడిచి పారిపోయాడు. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అధికార పార్టీ నేత వయస్సు 47 సంవత్సరాలు.. ఆయనకు అప్పటికే పెళ్లయి 21 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీ నేత కూతురు వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని హర్ధోయ్ ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల ఆశిష్ శుక్లాకు బీజేపీ నేతగా ఆ ప్రాంతంలో మంచి పాపులారిటీ ఉంది.
సిటీ బీజేపీ జనరల్ సెక్రటరీగా అతడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆశిష్‌కు పెళ్లయి 21 ఏళ్ల కుమారుడు, 7 ఏళ్ల కూతురు ఉన్నారు. అటువంటి ఆయన ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ నాయకుడి కూతురితో ప్రేమలో పడ్డారు. ఆ యువతి వయసు 26 సంవత్సరాలు. వయసు, పెళ్లి వారి ప్రేమకు అడ్డుకాలేదు. ఇద్దరూ పోటాపోటీగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో వాళ్లకు తెలిసింది. దీంతో ఆమెకు ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్లు పెళ్లి నిశ్చయించారు. ఆమె తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని ఎంత మొత్తుకున్నా వారు వినలేదు. ఈ నేపథ్యంలోనే ఆశిష్, ఆ యువతి ఇంట్లోంచి పారిపోవాలని నిశ్చయించుకున్నారు.
పక్కా ప్లాన్‌తో ఇంట్లోనుంచి పరార్ అయ్యారు. దీంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై బీజేపీ పార్టీ స్పందించింది. అతడిని సిటీ బీజేపీ జనరల్ సెక్రటరీ బాధ్యతలనుంచి తొలగించింది. పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. ఇకపై అతడికి పార్టీతో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. పోలీసులు అతడిపై చర్యలు తీసుకోవటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పార్టీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, పెళ్లయిన బీజేపీ లీడర్‌తో 26 ఏళ్ల యువతి ఇళ్లు విడిచి పారిపోయిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.