భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 40 కోట్ల మైలురాయిని దాటేసింది. 50,09,914 శిబిరాల ద్వారా టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు అందిన సమాచారం సూచిస్తోంది. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా ముమ్మరంగా చేపడుతోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ పరంగా భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టీకాలను భుజాలకు ఇస్తారని, అయితే కోవిడ్ టీకాలను వేయించుకున్నవాళ్లు బాహుబలులు అయినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
ప్రతి ఒక్కరూ కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుని ఉంటారని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని, దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నారని, వాళ్లంతా బాహుబలులు అయినట్లు మోదీ తెలిపారు. ప్రపంచం అంతా మహమ్మారితో సతమతం అయ్యిందని, పార్లమెంట్‌లో ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగాలన్నారు.
దేశంలో మహమ్మారి మూడో ఉద్ధృతి కమ్ముకొస్తోందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధం కావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు లేఖలు రాస్తున్నారు. ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులో సమావేశమై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. వ్యాక్సినేషన్‌లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో ఉన్నాయి.
టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా వేగంగా అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. డిసెంబరు 31 నాటికల్లా అర్హులందరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మొత్తం 189 కోట్ల డోసులు కావాలి.