యూపీలోని ఓ ఊచకోత కేసుకు సంబంధించి స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో 72 మంది ప్రాణాలు పోతే.. అరెస్టైన నిందితులను విషయంలో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఘటనపై 36 ఏళ్ల తరువాత తీర్పు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
మన దేశంలో ఇప్పటికే ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న కేసుల తీర్పు వెల్లువడే సరికి ఏళ్లు గడిచిపోతాయి. ఇప్పటికే కొన్ని కేసుల విషయంలో ఏళ్ల తరబడి విచారణ సాగి.. ఇటీవల తీర్పులు వెలువడ్డాయి. అయితే ఈ తీర్పులు కొందరికి అనుకూలంగా రాగా మరికొందరికి ప్రతికూలంగా వస్తున్నాయి. ఇలా ఏళ్ల తరబడి నడిచిన కేసులను మనం అనేకం చూశాం. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ జిల్లా మాల్యానాలో 36 ఏళ్ల కిందట ఓ వర్గానికి 72 మందిని ఊచకోత కేసులో తాజాగా తీర్పు వెలువడింది. ఈ కేసులోని 39 మంది నిందితులను స్థానిక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అసలు మాల్యానాలో జరిగిన ఆ ఊచకోత ఘటన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లా మాల్యానాలో 1987 మే 23న మారణహోమం జరిగింది. ప్రావిన్షియల్ సాయుధ కాన్‌స్టాబులరీ సైనిక బృందంతో పాటు స్థానికులు వందలాది మంది తుపాకులు, కత్తులతో మాల్యానా పట్టణంలోకి ప్రవేశించారు. అలానే ఆ పట్టణం నుంచి లోపలి వారు బయటకు వెళ్లకుండా సరిహద్దులోని మొత్తం ఐదు ప్రవేశ మార్గాలను మూసివేశారు. ఆ తరువాత మాల్యానాపై ఊచకోతకు తెగబడ్డారు. ఈ మారణకాండలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయాల పాలయ్యారు. ఈఘటన జరిగిన సమయంలో స్థానికులు సంచలన విషయాలు తెలిపారు. వారు తెలిపిన ప్రకారం.. ఓ ఇంట్లో తన ఇద్దరు పిల్లలను పట్టుకుని ఉన్న మహిళ కాలిపోయిన స్థితిలో కనపడింది.
అలానే ఒకే కుటుంబానికి చెందిన 11 మందిని కాల్చి బావి పడేశారు. ఈ కేసులో మొత్తం 93 మంది నిందితుల్లో 23 మంది చనిపోగా.. మరో 31 మందిని ఇప్పటి వరకూ గుర్తించలేకపోయారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈకేసు విచారణ విషయంలో తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 39 మందిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై బాధితుల తరపు న్యాయవాది అల్లాద్దీన్ సిద్ధికీ విచారం వ్యక్తం చేశారు. విచారణలు కొనసాగుతున్న తరుణంలో ఇది ఆకస్మిక నిర్ణయం.. 34 పోస్ట్‌మార్టమ్‌లపై విచారణ జరగలేదన్నారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై తాము హైకోర్టులో అప్పీలు చేస్తామని ఆయన తెలిపారు. మరి.. ఈ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.