మొసలి దాడిలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దైవ దర్శనానికి వెళ్తున్న 8 మంది భక్తులపై మొసలి దాడి చేసింది. అందులో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురు గల్లంతయ్యారు.
దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులపై మొసలి దాడి చేసి.. ముగ్గురిని బలితీసుకుంది. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఎనిమిది మంది భక్తులు రాజస్థాన్‌లోని కైలా దేవీ ఆలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకునేందుకు పయనమయ్యారు. మార్గమధ్యలో శివపురి జిల్లాలోని చిలవాడ్ గ్రామంలో చంబల్ నదిని దాటాల్సి వచ్చింది. ఆ సమయంలో నది దాటేందుకు పడవలు అందుబాటులో లేవు. నది దాటేందుకు వంతెన సైతం లేదు. అక్కడి ప్రజలు పడవల్లో ఆ నదిని దాటుతుంటారు.
వారు చేరుకున్న సమయానికి అక్కడ పడవలు లేకపోవడంతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని నీళ్లు తక్కువగా ఉన్న చోటు నుంచి నది దాటేందుకు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నీళ్లలోకి దిగారు. అలానే కొంతదూరం వెళ్లిన తర్వాత.. అక్కడ ఆగి ఉన్న నీళ్లలో నాచులో నక్కి ఉన్న పెద్ద మొసలి వారిపై దాడి చేసింది. మొసలి దాడితో ఒక్కసారి ఉలిక్కిపడ్డ వారంతా.. నీళ్లలో చెల్లాచెదురైపోయారు. కొంతమంది ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. నదిలో ఎనిమిది మందిపై మొసలి దాడి చేస్తున్న దృశ్యాలను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్‌తో గాలింపు చేపట్టి.. మూడు మృతదేహాలను వెలికితీయించారు. ఆ ముగ్గురు కూడా మొసలి దాడిలో మృతి చెందారు. అయితే మిగిలిన ఐదుగురు ఆచూకీ తెలియదు. నది ప్రభావంలో కొట్టుకుని పోయి, గల్లంతైనట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే.. గల్లంతైన వారిలో ఇంకెంత మందిని ఆ మొసలి చంపి తీనేసిందో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. దైవ దర్శనానికి అని బయలుదేరిన వారు.. మార్గ మధ్యలోనే మొసలికి బలికావడంతో వారి కుటుంబసభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకుని, నది దాటేందుకు వంతెనను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. మరి ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.