మనిషికి కోరికలు చెప్పమంటే.. పెద్ద లిస్టే ఉంటుంది. ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన కోరికలు ఉంటాయి. చిన్నదైనా, పెద్దదైనా కోరిక.. కోరికే. సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని, ఖరీదైన కారు, బైక్ కొనుక్కోవాలని, బంగారు, వజ్రాల ఆభరణాలు ధరించాలని అనుకుంటారు. ఇవన్నీ పేద, మధ్యతరగతి వారూ కనే కలలు. అలాగే జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని చాలా మందికి ఉంటుంది. కానీ అవి కొందరికీ కల్లలుగా మారిపోగా.. మరికొందరికీ పరిస్థితుల దృష్ట్యా నెరవేరలేకపోతున్నాయి. కోరికలు కలగడం కాదూ.. వాటిని నెరవేర్చుకోవాలనుకున్నారు ఈ సగటు మహిళలు. తాము అనుకున్నదీ జయించడం కోసం వాటి కోసం కష్టపడ్డారు. రూపాయి రూపాయి కూడబెట్టి అనుకున్నది సాధించారు.
కేరళలోని కొచ్చి నుండి బెంగళూరుకు విమానం బయలు దేరింది. అందులో 24 మంది మహిళలు మొదటి సారిగా విమానం ఎక్కారు. వీరంతా ధనవంతులు అనుకునేరూ.. కానేకాదూ. వీరంతా రోజువారీ కూలీలు. కొట్టాయంలోని పనాచ్చికాడ్ అనే గ్రామ పంచాయతీ వాసులు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులు చేసుకుంటారు. రోడ్లు శుభ్రం చేసే సమయంలో, పంచాయతీ పరిధిలోని నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో ఆకాశంలో నుండి విమానాలు వెళుతుంటే.. చూసి చిన్నపిల్లలా కేరింతలు కొట్టారు. వారికి విమానం ఎక్కాలని, ఎసి రైలులో ప్రయాణించాలని ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో వీరంతా ఓ ఆలోచన చేశారు. విమానం ఎక్కాలన్న తమ కలను నెరవేర్చుకునేందుకు రూపాయి రూపాయి కూడ బెట్టారు. రోజువారీగా వారికి వచ్చే కూలీ రూ. 311 లో నుండే పొదుపు చేసుకోవడం ఆరంభించారు. ఎట్టకేలకు వారి కలను నిజం చేసుకున్నారు.
‘మాకు విమానంలో, ఎసి రైలు ఎక్కాలని కోరిక ఉండేది. మేమంతా ఏకమై, తమ కలలను నెరవేర్చుకోవాలనుకున్నాం. మా సంపాదనలో నుండి పొదుపు చేయడం ఆరంభించాం. ఓ సంవత్సరం తర్వాత పంచాయతీ వార్డు సభ్యుడు అభిసన్ అబ్రహంను సంప్రదించాం. అతడు విమాన టికెట్లు బుక్ చేయడంతో పాటు మాతో పాటు ప్రయాణం చేశారు’అని 55 ఏళ్ల గీతా కృష్ణన్ తెలిపారు. ఈ బృందం గత గురువారం కొచ్చి నుండి బెంగళూరుకు విమానంలో చేరుకుంది. అనంతరం కర్ణాటక అసెంబ్లీని తిలకించే అవకాశం కూడా పొందారు. దీంతో వారి ఆనందం మరింత రెట్టింపు అయింది. ఆ తర్వాత మెట్రో రైలులో ప్రయాణించారు. వీరి తిరుగు ప్రయాణం ఏసీ రైలులో సాగింది. అయితే వీరికి సాయం చేయడం తనకెంతో ఆత్మ సంతృప్తినిచ్చిందని అబిసన్ తెలిపారు.
ఈ 25 మందిలో అతి చిన్న వయసు వారు 44 ఏళ్లు కాగా, పెద్ద వారు 77 ఏళ్లు. ‘నేను విమానంలో ప్రయాణించడం అదృష్టం. నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని చెల్లమ్మ అనే 77 ఏళ్ల మహిళ పేర్కొన్నారు. అయితే వీరు కల ఇంతటితో ఆగిపోలేదు. వచ్చే ఏడాది ఢిల్లీకి వెళ్లాలని ప్రణాళిక చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యి.. ప్రధాని మోడీ జెండా ఎగుర వేయడాన్ని చూడాలని అనిపిస్తుందని అన్నారు ఈ మహిళలు. ఇది సాధ్యమౌతుందో లేదో తెలియదు కానీ తమ ప్రయత్నం మాత్రం ఆపబోమని ముక్తకంఠంతో చెబుతున్నారు. కలలు కనడం కాదూ.. ధృఢ సంకల్పతో కలలు నెరవేర్చుకున్న ఈ మహిళా కార్మికుల విజయ గాధపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.