హనీట్రాప్ కేసులు ఈమధ్య ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతలో భాగంగా విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకుని హనీట్రాపింగ్‌కు దిగుతున్నాయి శత్రుదేశాలు. తాజాగా ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది.
అందం అందర్నీ ఆకట్టుకుంటుంది. అదీ స్త్రీ అందమైతే ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆడవారి కోసం ఒకప్పుడు రాజుల మధ్య యుద్ధాలే జరిగేవి. అందుకేనేమో, కొందరు స్త్రీలు తమ అందాన్ని వలగా వేసి పురుషులను లోబర్చుకుంటున్నారు. దీనినే ఈమధ్య కాలంలో హనీట్రాప్‌గా పిలుస్తున్నారు. ఈ ‘వలపు వల’లో సామాన్యులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చిక్కుకుంటున్నారు. మరీ ముఖ్యంగా దేశ భద్రతలో భాగంగా విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు కూడా హనీట్రాప్‌లో చిక్కుకుంటుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. శత్రు దేశాలు మన దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని హనీట్రాప్‌ల ద్వారా సేకరిస్తుండటంతో ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. చైతన్య శిబిరాలు పెట్టి మరీ విలువైన పాఠాలు నేర్పుతున్నాయి. అయినా హనీట్రాప్ కేసులు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఒడిశా రాష్ట్రంలో ఇలాంటి మరో కేసు వెలుగుజూసింది.
ఒడిశా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా సునాబెడలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో హనీట్రాప్ ఉదంతం కలకలం రేపింది. ఈ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు ఎంప్లాయీస్ హనీట్రాప్‌లో చిక్కుకున్నారని సమాచారం. కంపెనీకి చెందిన కీలకమైన సమాచారాన్ని ఈ ఇద్దరు ఉద్యోగులు లీక్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఒక యువతి వీరి మీద వలపు వల విసిరి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు అధికారులు చెప్పారు. హెచ్‌ఏఎల్‌లో పనిచేస్తున్న సీనియర్ అధికారి సత్యజిత్ ఖడంగాతో పాటు మరో ఉద్యోగి దేబాశిస్ కుమార్ నాయక్‌ను సీబీఐ అధికారులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. రక్షణ శాఖ పరిధిలోని హెచ్‌ఏఎల్ సంస్థలోని పలు కీలకమైన డాక్యుమెంట్లను లీక్ చేసిన ఆరోపణల మీద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏయే పత్రాల్లోని సమాచారాన్ని లీక్ చేశారనే దాని మీద వీరిని అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు తెలిసింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.