పరాన్న జీవులు, పారాసైట్స్ అంటే అందరూ చదువుకునే ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అవి మన అవయవాల్లోకి కూడా ప్రవేశిస్తాయి. మన శరీరాన్నే వాటి ఆవాసంగా మార్చుకుని పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. అలాంటి ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఏకంగా 15 మంది కళ్లల్లో కీటకాలు- వాటి గుడ్లు బయటకు రావడం అందరినీ భయాందోళనకు గురి చేసింది.
పురుగులు, కీటకాలు, పారాసైట్స్, నులిపురుగులు ఇలాంటి మాటలు వినే ఉంటారు. పర్యావరణంలో కాకుండా మన శరీరంలో కూడా క్రిమి కీటకాలు ఉంటాయని చాలా మందికి తెలుసు. అయితే అవి ఎప్పుడూ మనుషులని ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉండవు. కానీ, కొన్ని పరాన్న జీవులు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మాత్రం మనిషికి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అవి మన అవయవాల్లో ప్రవేశిస్తే చాలా వేగంగా సంతానోత్పత్తిని ప్రారంభిస్తాయి. అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఈ ఘటన గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది.
ఈ వింత ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. 15 మంది కళ్ల నుంచి కీటకాలు దారలు కడుతున్నాయి. కీటకాల గుడ్లు కూడా కళ్ల నుంచి బయటకు రావడం అందరినీ ఆశ్యర్యానికి, ఒకింత భయానికి గురి చేసింది. అహ్మద్ నగర్ జిల్లాలోని రాహురి ప్రాంతంలోని వాలన్ లో రైతుల కూలీలకు ఈ వింత అనుభవం ఎదురైంది. 15 మంది ఉల్లి కోసేందుకు పొలానికి కూలికి వెళ్లారు. కోతకు వచ్చిన ఉల్లి మొక్కలను కోయడం ప్రారంభించారు. కాసేపటికి ఆ 15 మందికి కళ్లు మండటం ప్రారంభమయ్యాయి. ఉల్లి కాబట్టి కళ్లు మండటం సహజం అనుకున్నారు. కానీ, ఓసారి వైద్యుడి దగ్గరకు వెళ్లారు. అందరికీ డాక్టర్ మందులు రాసిచ్చారు. అవి వేసుకున్న తర్వాత వారికి ఉపశమనం అనిపించింది.
అందరూ ఎప్పటిలాగానే భోజనం చేసి నిద్రపోయారు. కానీ, అందరికీ రాత్రి ఒక్కసారిగా కళ్లు మండటం, దురద ప్రారంభమైంది. ఆ కూలీల్లో కొందరు రాహులరిలోని ఐ ఆస్పత్రికి, మరికొందరు జిల్లా ఆస్పత్రికి పరుగులు తీశారు. పరీక్షించిన వైద్యులు.. వారి కళ్ల నుంచి కొన్ని కీటకాలను, వాటి గుడ్లను బయటకు తీశారు. అయితే అవి వారి కళ్లలోకి ఎలా వచ్చాయి? అందరికీ ఒకేసారి అలా ఎలా జరిగింది? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకలేదు. పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే అసలు విషయం ఏంటనేది తెలుస్తుందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలయజేయండి.