వడదెబ్బ చూడ్డానికి చిన్నగా అనిపిస్తుంది కానీ నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలను తీసుకెళ్లిపోతుంది. వడదెబ్బ కారణంగా ఒక్కరోజే 13 మంది మృతి చెందగా.. 600 మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఏటేట ఎండల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎండల తాకిడి ఎక్కువగానే ఉంది. ఇంట్లోంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి. వడదెబ్బ తగిలే అవకాశం ఉందని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. కానీ జనాలు అవేమీ పట్టించుకోకుండా తిరిగేస్తున్నారు. దీంతో వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోవడం, అస్వస్ధతకు గురవ్వడం జరుగుతుంది. వడదెబ్బ కారణంగా 13 మంది మృతి చెందగా.. 600 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వేసవి కాలంలో ప్రజలను ఇబ్బంది పెట్టేలా సభలు నిర్వహించడమే ఇందుకు మూల కారణం. భారీ సంఖ్యలో జన సమీకరణ చేసి సభలు నిర్వహిస్తారు. అయితే అక్కడకి వచ్చిన వారికి ఏర్పాట్లు మాత్రం చేయరు. ఈ కారణంగానే వందల మంది వడదెబ్బ బారిన పడ్డారు.
ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాజధాని నావీ ముంబయిలో ఖర్ఘర్ అంతర్జాతీయ కార్పొరేట్ పార్క్ మైదానంలో ఆదివారం నిర్వహించిన మహారాష్ట్ర భూషణ్ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా వేలాది మంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వేడుక.. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కొనసాగింది. సభా మైదానం జనంతో కిక్కిరిసిపోయింది. నిర్వాహకులు కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేశారు కానీ ఎండ తాపం నుంచి రక్షణకు ఎలాంటి టెంట్లు గానీ, షెడ్లు గానీ వేయలేదు. వీఐపీలు కూర్చునే వేదిక వరకూ మాత్రం టెంట్లు వేసుకున్నారు. కానీ మిగతా జనం గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. అంతటి మండుటెండలో 5 గంటల పాటు ఏకధాటిగా కూర్చుని ఉండడంతో విపరీతమైన ఎండ, ఉక్కబోతకు గురై సొమ్మసిల్లిపోయారు.
600 మంది వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బ తీవ్రతకు ఇప్పటి వరకూ 13 మంది మృతి చెందినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వెల్లడించారు. మృతుల్లో 8 మంది మహిళలు ఉన్నారని తెలుస్తోంది. వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిన 50 మందిని నావీ ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 600 మందికి వడదెబ్బ తగిలిన కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని.. వడదెబ్బ బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం అన్నారు. ఆదివారం 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, మండుటెండలో కూర్చోవడం కారణంగానే మృతి చెందారని,అస్వస్థతకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. మరి ఇంతటి మండుటెండలో ప్రజల రక్షణ కోసం ఏ మాత్రం ఆలోచించకుండా సభలు నిర్వహించడం ఎంత వరకూ కరెక్ట్? దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.