సోషల్ మీడియా వాడకం పెరిగాక ప్రతీ విషయం క్షణాల్లో వైరల్ అవుతోంది. దీంతో ప్రజలకు ఏదైన సమస్య ఉంటే నేరుగా అధికారుల దగ్గరకు వెళ్లే అవసరం కూడా కొన్ని సందర్భాల్లో ఉండటం లేదు. వీడియో తీసి వైరల్ చేస్తే చాలు క్షణాల్లో అధికారులు సమస్య దగ్గరికి వాలిపోతున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడు సైతం ఇలాగే తమ బడిలోని సమస్యలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ బాలుడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 12 ఏళ్ల బాలుడు తన పాఠశాలలోని సమస్యలన్నింటినీ బయటపెట్టాడు. జార్ఖండ్ రాష్ట్రం గొడ్డా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల సమస్యలకు నిలయం అయింది. వారి సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు. దీంతో ఇక లాభం లేదనుకున్న ఓ విద్యార్థి తానే బడిలో నెలకొన్న సమస్యలను అందరికి తెలియజేశాడు. దానికి అతడు ఎంచుకున్న దారే ఇప్పుడు ఆ బాలుడిని ప్రశంసించేలా చేస్తోంది.
ఈ 12ఏళ్ల బాలుడు తాగి పాడేసిన ఓ కూల్ డ్రింక్ బాటిల్ ని మైక్ లా పట్టుకొని జర్నలిస్ట్ లా తమ పాఠశాలలో ఉన్న సమస్యలను వివరించాడు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేరు. అలాగే విద్యార్ధులకు తాగడానికి మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదని, అదీకాక సరైన బాత్రూం లేకపోవడంతో ఆడపిల్లలు మల విసర్జన కోసం బయటికి వెళ్లాల్సి వస్తోందని తెలిపాడు. స్కూల్ ఆవరణం మెుత్తం పిచ్చి మెుక్కలతో నిండి ఉందని చూపించాడు. ఇదేనా స్వచ్చ భారత్ అంటే అని ప్రశ్నించాడు. అంతే కాదు స్కూల్లో టీచర్ లు ఎవరూ లేకపోవడంతో.. తలుపులు తీసివున్న క్లాస్ రూమ్‌లోకి వెళ్లి మరీ జర్నలిస్టులా రిపోర్టింగ్ చేశాడు.
అక్కడున్న చిన్న బాలుడ్ని ఎందుకు స్కూల్‌లో ఎవరూ లేరు? ఎందుకని విద్యార్ధులు రావడం లేదని ప్రశ్నించి అతనితోనే సమాధానం చెప్పించాడు. ఇదంతా ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. స్వాతంత్య్ర భారతంలో మారింది ఇదేనా అంటూ.. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ చూసైనా అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి మరి. బడిలో సమస్యలను వెరైటీగా సమాజానికి తెలియజేసిన బాలుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.