పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కొన్ని చోట్లు గోల్ గప్ప, గప్ చుప్ అని పిలుస్తారు. పానీపూరి చాలా మంది ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. వీధుల్లో ఎక్కడ కనిబడితే.. అక్కడ దొరికే పానీపూరి కోసం చాలా మంది ఎగబడుతుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ పానీపూరి తింటూ ఈ లోకాన్నే మైమరచిపోతుంటారు. కొంత మంది వ్యాపారులు పానీపూరికి వాడే రసం విషయంలో పొరపాటు చేయడంతో అది తిన్నవారు అస్వస్థతకు గురి అవుతుంటారు. పానీపూరి తిని వందమందికిపైగా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హుగ్లీ జిల్లాలోని ఓ వీధి బండి వద్ద బుధవారం చాలా మంది పానీ పూరి తిన్నారు. పానీ పూరీ తిన్న సాయంత్రానికి చాలా మంది వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న వైద్యారోగ్య శాఖ.. ప్రత్యేక వైద్య బృందాలను రోగులకు మందులు అందించారు. దాదాపు వంద మంది వరకు అస్వస్థతకు గురయ్యారని.. వారంతా అక్కడ పరిసర గ్రామాల వారని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కలుషిత ఆహారానికి సంబంధించిన శాంపిల్స్ సేకరించారు.
ఇటీవల భారీ వర్షాల కారణంగా నీరు ఎక్కువగా కలుషితం అవుతుందని.. బయట పానీ పూరీ తినే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లల విషయంలో ఇది చాలా అవసరం అని సూచిస్తున్నారు. ఇటీవల మద్యప్రదేశ్ లో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.. పానీ పూరి తిని 97 పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.