కొంతమంది చిన్నతనం నుంచి అసాధారణమైన ప్రతిభను కనబరుస్తుంటారు. సంగీతం, క్రీడలు, ఎడ్యూకేషన్, డ్యాన్స్ ఇలా ఎన్నో విషయాల్లో అత్యద్బుతమైన ప్రతిభ చాటుకుంటూన్న విషయం తెలిసిందే.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు.. అన్న ఓ కవి మాటలు అక్షర సత్యం చేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. కృషి, పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు అని నిరూపించారు. చిన్న వయసులోనే చదువు పట్ల అసాధారణ ప్రతిభ కనిపించిన ఎంతో మంది విద్యార్థులు రికార్డులు క్రియేట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన పదేళ్ల బాలుడు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాడు. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రాదేశ్ కి చెందిన అయాన్ గుప్తా అనే 10 ఏళ్ల బాలుడు టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ లో 76.67 పర్సెంటేజ్ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు అయాన్ డిస్టింక్షన్ తో పాస్ కావడంతో తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోతున్నారు. వాస్తవానికి యూపీ బోర్డు నియమం ప్రకారం టెన్త్ ఎగ్జామ్స్ లో హాజరు కావడానికి కనీసం వయసు 14 సంవత్సరాలు ఉండాలి. కానీ అయాన్ వయసు మాత్రం పది సంవత్సరాలు కావడంతో పాఠశాల ప్రిన్సిపల్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని పరీక్షలు రాయించారు. గ్రేటర్ నోయిడా కు చెందిన అయాన్ గుప్తా తండ్రి చార్టర్డ్ అకౌంటెంట్. తల్లి సవితా గుప్తా గృహిణి. భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నత చదువు చదివినవారు కావడంతో అయాన్ చిన్నప్పటి నుంచి చదువు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు.
చిన్నప్పటి నుంచి అయాన్ చదువుకు సంబంధించిన అన్ని సందేహాలను నివృతి చేసేవారు తల్లిదండ్రులు. ఇక కరోనా సమయంలో ఇంటి వద్దనే ఉండటంతో అయాన్ తన పాఠ్య పుస్తకాలను పక్కనబెట్టి ఉన్నత చదువులకు సంబంధించిన పుస్తకాలను చదవడం ప్రారంభించాడు. అయాన్ కి ఇంట్లో ట్యూషన్ చెప్పిస్తూ.. తన కోరిక మేరకు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ రాయించాలని అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నామని తల్లిదండ్రులు అంటున్నారు. ఇందుకోసం స్కూల్ ప్రిన్సిపల్ తో బోర్డు అనుమతి తీసుకోవాల్సిందిగా కోరామని.. అయన అనుమతి తీసుకొని అయాన్ టెన్త్ ఎగ్జామ్స్ రాసేలా చేశారని అన్నారు. తమ కొడుకు డిస్టింక్షన్ లో పాస్ కావడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు అయాన్ తల్లిదండ్రులు. అయాన్ ఇంజనీర్ కావాలన్నదే అతని కోరిక.. ఇందుకోసం జేఈఈ లాంటి ఇతర ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి సిద్దం అవుతున్నట్లు తెలిపారు.