విక్టరీ వెంకటేష్, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందిన మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారప్ప’. డి. సురేష్‌బాబు, కలైపులి యస్ థాను సంయుక్తంగా నిర్మించారు. తండ్రి, కొడుకు పాత్రల్లో వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియమణి నటించింది. ఈ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేశారు..
ప్రపంచంలో అది పెద్ద సంస్థగా పేరొందిన డిస్నీ సంస్థ థియేటర్‌లతోపాటు ఓటీటీలోనూ చిత్రాలను విడుదల చేస్తోంది. పరిస్థితులను బట్టి ప్రేక్షకుల అభిరుచి మారిందని ఆ సంస్థ గ్రహించింది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలే ఓటీటీ బాట పడుతున్నారు. కొవిడ్ రాకపోయి ఉంటే ఓటీటీ ఇంత పాపులర్ అయ్యేది కాదు. కానీ కరోనా పరిస్థితుల్లో ఓటీటీ సినిమా ఇండస్ట్రీని కాపాడింది. కాబట్టి ఓటీటీని ఆపడం అనేది భ్రమే. వెబ్‌సిరీస్‌ల సంఖ్య పెరగడం వల్ల సినీ కార్మికులకు పలు విభాగాల్లో ఉపాధి లభిస్తోంది. నిర్మాతలకు లాభం లేకుండా లేదు. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది ఎగ్జిబిటర్లే.
కరోనా వల్ల గడిచిన 15 నెలల్లో 12 నెలలు థియేటర్లు మూసి ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. ఆస్తి పన్ను, మినిమం పవర్ చార్జీల్లో కూడా రాయితీ ఇవ్వడం లేదు. 15 నెలలుగా వాడని విద్యుత్‌కు బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ఓటీటీ వల్ల థియేటర్ వ్యవస్థలో కాస్త మార్పు వస్తుందేమో కానీ కనుమరుగయ్యే అవకాశం లేదు. అందుకే ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు .
కలైపులి ఎస్.థాను తన అభిప్రాయాలను ఈ విధంగా వెలిబుచ్చారు .కరోన కారణంగా మన కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కు వెళ్ళి సినిమా చూడలేని పరిస్థితిలో అందరం ఉన్నాం . అలాంటపుడు ఇక ప్రేక్షకులు థియేటర్‌కి ఎలా వస్తారని ఆలోచించి ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉండేలా నారప్పని ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించాం. దీనికి సురేష్ బాబు కూడా సమ్మతించారు. అదీగాక ఎప్పుడో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ మూవీని థియేటర్లు తెరిచేంతవరకు విడుదల చేయకుండా ఉండలేం.
నిర్మాణం కోసం పెట్టిన పెట్టుబడికి వడ్డీ పెరిగిపోతుంది. ఇదే జరిగితే నష్టాలు వస్తాయి . ఈ ఏడాది మా సంస్థపై ధనుష్ హీరోగా రూపొందించిన ‘కర్ణన్’ చిత్రం విడుదల చేసిన మరుసటి రోజే థియేటర్లలో సీటింగ్ కెపాసిటీని 50 శాతానికి తగ్గించేశారు. మరోవారం రోజుల తర్వాత శనివారాల్లో రాత్రి షోలు రద్దు చేయగా, ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. ఈ కారణంగా రూ.10 కోట్ల మేరకు లాస్ అయ్యాం. ‘నారప్ప’కు ‘కర్ణన్’ పరిస్థితి రాకూదనే ఓటీటీకి మొగ్గుచూపాం.ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసేందుకు సరైన హీరో కోసం అన్వేషిస్తుండగా హీరో వెంకటేష్ ఈ ‘అసురన్’ చిత్రాన్ని చూసి తెలుగులో నటించేందుకు ఆయనే ముందుకు వచ్చారు.
వెంకటేష్‌తో మా సంస్థ నిర్మించిన రెండో చిత్రమిది. గతంలో నిర్మించిన ‘ఘర్షణ’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.‘నారప్ప’ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని మాకెంతో నమ్మకం ఉందని థాను తెలియచేసారు.
ఇదే విషయంపై సురేష్ బాబు స్పందిస్తూ అదే అభిప్రాయాన్ని ఆయన కూడా వ్యక్తం చేశారు .ఇప్పుడున్న పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యులనే నేను థియేటర్లకు పంపను. అలాంటప్పుడు బయటి వ్యక్తులను థియేటర్లకు వచ్చి మా సినిమా చూడమని ఎలా అడుగుతానని అన్నారు .ఈ చిత్ర నిర్మాణంలో కలైపులి ఎస్.థానుగారిది మెజారిటీ షేర్ కావడంతో రిలీజ్ విషయంలో ఆయన నిర్ణయానికే ఏకీభవించాం.ఒకవేళ థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు వస్తారా?’అన్నది కూడా ఒక సందేహం!ఆర్థిక ఇబ్బందులు రాకూడని ముందు చూపుతో ‘నారప్ప’ను ఓటీటీలో విడుదల చేయాలని థానుగారు నిర్ణయించుకున్నారు.
సురేష్‌ప్రొడక్షన్స్ సొంతచిత్రం అయితే తప్పకుండా థియేటర్లలోనే విడుదల చేసేవాళ్లం.‘నారప్ప’ను థియేటర్లలో విడుదల చేయాల్సి వచ్చినందుకు వెంకటేశ్, నేనూ అందరం బాధపడ్డాం. కానీ తప్పలేదు.నారప్ప లాంటి నిరుపేద, రైతు పాత్రలో వెంకటేశ్ ఇప్పటి వరకు నటించలేదు. అందుకే రీమేక్ చేశాం. వెంకటేశ్ నారప్పగా ఆ పాత్రకు జీవం పోసారు. ‘నారప్ప’ పాత్రను వెంకటేశ్ ఒక సవాల్‌గా భావించి బాగా నటించారు . ఇంటర్వెల్ సమయంలో వచ్చే పోరాట సన్నివేశాల ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి .
వెంకటేష్ ఆ సన్నివేశం కోసం చాలా కష్టపడ్డాడు.కథలో పెద్దగా మార్పులు చేయలేదు. సినిమా చాలా సహజంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిల్లో తెలంగాణా కంటే ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉందని డి.సురేశ్‌బాబు పేర్కొన్నారు. ఆంధ్రాలో ప్రభుత్వం నిర్దేశించిన టికెట్ రేట్లకు సినిమా హాళ్లు నడపడం సాధ్యం కాదని ఆయన అన్నారు. టికెట్ ధరల్లో చిన్న సవరణలు అడిగినా ఏపీ ప్రభుత్వం చేయడం లేదు. సింగిల్ స్ర్కీన్ థియేటర్స్ యాజమాన్యాలు సినిమా మీద ప్రేమతో నడపడమే తప్ప పైసా లాభం ఉండదు. రూ. 40 టిక్కెట్‌తో ఏసీ థియేటర్లు నడపడమంటే హౌస్‌ఫుల్ అయినా కూడా కరెంట్ బిల్లు రాదు.
ప్రభుత్వం వారిని అడిగితే థియేటర్లు తెరచిన తరువాత చూద్దాం అంటున్నారట. అక్కడి థియేటర్‌ల పరిస్థితి యాజమాన్యాలకు ఇది ఒక సమస్యగా తయారయింది ’’ అని సురేశ్ బాబు అన్నారు. ఏదిఏమైనా పెద్ద హీరోల చిత్రాలుఈ విధంగా విడుదలవుతూ ఒక నూతన అధ్యాయనానికి నాంది పలికాయి.. ప్రస్తుత పరిస్థితుల్లో నారప్ప చిత్రం ప్రేక్షకులకి ఓ టీ టీ విడుదల కావటం ముఖ్యంగా ఆరోగ్యపరం గా ఎంతో మేలు కలిగిస్తుందని భావించవచ్చు .