దేశంలో దేవాలయాలకు కొదవ లేదు. దేవుళ్లు అద్బుతాలు చేస్తుంటారని ప్రజలు విశ్వసిస్తుంటారు. వారి మోక్షం కోసం పూజలు చేస్తుంటారు. దేవుడు పాలు, నీళ్లు తాగాడని, కళ్లు తెరిచాడని, విబూది రాల్చాడని వార్తలు వినబడితే చాలు.. ఆ అద్బుతాలు చూసేందుకు భక్త జనాలు కూడా క్యూ కడుతుంటారు. తాజాగా మరో చోట దేవుడు కళ్లు తెరిచాడన్న వార్త వైరల్ గా మారింది.
మనిషి ఆశా జీవి. అందుకే భయ భక్తులకు లోను అవుతుంటాడు. తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడన్న భావనలో బతుకుతుంటారు. భగవంతుడికి మొరపెట్టుకుంటే కోరికలు తీరుస్తాడన్న విశ్వాసంలో ఉంటారు. వారి మోక్షం కోసం పూజలు, పుణస్కారాలు, పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఎక్కడైనా దేవుడి మహత్యం కనిపిస్తుందంటే చాలు తండోపతండాలుగా వెళ్లిపోతుంటారు. ఆ విగ్రహం పాలు తాగిందని, లేదా నీళ్లు తాగిందని చెబితే చాలు.. వాటిని ఆ విగ్రహానికి పట్టించేందుకు వెళ్లిపోతుంటారు. ఇక దేవుడు కళ్లు తెరిచాడని చెబితే చాలు ఆయన కరుణ, కటాక్షాల కోసం వేల కిలోమీటర్లైనా వెళ్లిపోతారు. ఇటువంటి ఘటనే ఇప్పుడు వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా కరీమబాద్‌లో ఉన్న శివాంజనేయ ఆలయంలో ఓ నంది విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఇప్పుడు కళ్లు తెరిచిందన్న వార్త హల్ చల్ చేస్తోంది. దీంతో స్థానికులంతా ఆ వింతను చూసేందుకు గుడికి క్యూ కట్టారు. చూసేందుకు అచ్చంగా నందీశ్వరుడు కన్ను తెరిచినట్లు కనిపించడంతో దీన్ని ఫోటో తీసి వాట్సప్ లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. మామూలుగా నంది విగ్రహాలన్నీ కళ్లు మూసి ఉన్నట్లు కనిపిస్తుంటాయి. ఇది కళ్లు తెరిచినట్లు కనిపించే సరికి ఇక స్థానికులు పెద్ద యెత్తున వీక్షించేందుకు ఆ గుడికి బారులు తీరుతున్నారు. కలియుగంలో పాపులను చూసి కళ్లు తెరిచాడంటూ ఆ విగ్రహానికి పూజలు చేసి, తమ మొర ఆలపిస్తున్నారు భక్త జనాలు.
అయితే ఆ విగ్రహానికి ఉన్న విబూది తడిసి, అది కంటి మీదకు జారి.. అది కళ్లు తెరిచినట్లు కనబడుతుందని కొంత మంది సైంటిఫిక్ వాదులు చెప్పుకుంటున్నారట.ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నచందంగా తయారయిన ఈ సోషల్ మీడియా యుగంలో.. ఏదీ చూసినా వింతగానే అనిపిస్తుందీ జనాలకూ అని వాపోతున్నారు. నంది విగ్రహం కళ్లు తెరిచిందన్న వార్త వినగానే.. ఏమీ ఆలోచించకుండా విగ్రహానికి చూసేందుకు ఎగబడుతున్నారు జనాలు. దేశంలో ఎవరీ విశ్వాసం వారిది కనుక.. నలుగురితో నారాయణ, గుంపులో గోవింద అనుకోవాల్సిందేనంటూ పలువురు భావిస్తున్నారట. నిజంగా నంది విగ్రహానికి అంతటి మహత్తు ఉండి, కళ్లు తెరిస్తే ఏం జరుగుతుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.