మధ్యప్రదేశ్- ఎప్పుడు ఎవరి మధ్య ప్రేమ పుడుతుందో, ఎవరి మధ్య ఎలాంటి సంబందం ఏర్పడుతుందో ఎవ్వరం చెప్పలేం. ఇక ప్రేమ ఆడ, మగ మధ్యే కాదు.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య, లేదంటే ఇద్దరు మగవాళ్ల మధ్య కూడా పుట్టవచ్చు. ఈ కాలంలో ఇలాంటివి మనం చాలానే చూస్తున్నాం. మధ్యప్రదేశ్ లో ఇలా వరుసకు వదినా మరదళ్లు అయ్యే వారి మధ్య బంధం చుగురించింది. కానీ చివరకు ఏమయ్యిందో కాని కధ విషాదాంతం అయ్యింది.
మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 30 సంవత్సరాల పూనం, 20 ఏళ్ల మంజు పక్క పక్క ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. వీళ్లిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. ఇద్దరు వరుసకు వదినా మరదళ్లు అవుతారు. పూనం కు పెళ్లి జరిగి సుమారు 7 సంవత్సరాలు అవుతోంది. మంజుకు ఈమధ్యనే జూన్ 20న పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత అత్తారింటికి వెళ్లిన మంజు రాఖీ పండగ కోసం పుట్టింటికి వచ్చింది.
ఐతే అప్పటికే పూనం చేతిమీద మంజు పేరును పచ్చబొట్టు వేయించుకుంది. దీంతో పూనం భర్త చాలా సార్లు భార్యతో గొడవపడ్డాడు. మంజు పేరు ఎందుకు పచ్చబొట్టు వేయించుకున్నావని ఎంత ప్రశ్నించినా పూనం మాత్రం సమాధానం చెప్పలేదు. ఇప్పుడు మంజు పుట్టింటికి రావడంతో మళ్లీ భర్త మరోసారి పూనంను పచ్చబొట్టు గురించి నిలదీశాడు. కానీ ఈ సారి కూడా పూనం పచ్చబొట్టు గురించి పెదవి విప్పలేదు. పుట్టింటికి రాగానే పూనం ఇంటికి వచ్చింది మంజు. కాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు.
మరి తన చేతిపై పచ్చ బొట్టు గురించి భర్త అడిగిన విషయాన్ని మంజుకు చెప్పిందో లేదో తెలియదు కానీ, ఇద్దరు కలిసి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నారు. ఎంత సేపైనా పూనం, మంజులు తలుపులు తీయకపోయే సరికి ఐదేళ్ల పూనం కొడుకు వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పాడు. అంతా వచ్చి చూసే సరికే ఇద్దరు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. వెంటనే పోలీసులకు ఈ సమాచారం అందించారు. మరి ఈ వదినా మరదళ్ల మధ్య ఉన్న బంధం ఏంటీ, అసలేం జరిగిందన్నది అంతు పట్టక ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.