ప్రభుత్వాలు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అందులోని గోరంత లోపాన్ని కూడా కొండంత చేసి చూపడం ప్రతిపక్షాలకు అలవాటు. అధికారంలో ఉన్న వారి నిర్ణయాలను విపక్షలు వ్యతిరేకించడం, విమర్శించడం సహజం. కాకుంటే అందులో ఎంత నిజమున్నది అనేదే అసలు అంశం. ప్రతిపక్షం చేసే విమర్శలతో ప్రభుత్వం అనుకున్న పని చేయకుండా ఆగదు. కానీ తాము పాలించేటప్పుడు ప్రవేశపెట్టిన కార్యక్రమాలను మరిచిపోయి వ్యవహరిస్తే నవ్వుల పాలుకావడం ఖాయం. ఏపీలో ‘మటన్ మార్ట్’పై జరుగుతున్న రచ్చలో టీడీపీ చేస్తున్న విమర్శలు అలానే ఉన్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
జగన్ ప్రభుత్వం మటన్ మార్ట్‌లపై ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోక ముందే విమర్శల వర్షం కురిపించడాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ప్రభుత్య కార్యక్రమం చర్చల దశలో ఉన్నప్పుడే వేస్ట్ అని తీసిపారేయకుండా.. కొంత సమయం తీసుకుని ఆ కార్యక్రమ విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించిన తర్వాత వాటిని అధ్యాయనం చేసి.. అప్పుడు విమర్శిస్తే అది సద్విమర్శ అవుతుంది. సరే జరగబోయే తప్పిదాన్ని ముందే గ్రహించి హెచ్చరిస్తున్నారే అనుకుందాం. ప్రభుత్వం మాంసం అమ్మడం అనేది ఎప్పుడు, ఎలా, ఎవరి హయాంలో మొదలైందో అనే కనీస అవగాహన ఉండాలిగా. ప్రభుత్వం మాంసం వ్యాపారం చేయడమేంటి అని హేళనగా మాట్లాడుతున్న టీడీపీ నేతలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిందే.
నాలుగు దశాబ్ధాల క్రితం నుంచే ప్రభుత్వం మాంసం విక్రయించడం అనే కాన్సెప్ట్ ఉంది. దాన్ని దగ్గరి ఉండి చూసిన వ్యక్తిగా ఆ కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వాలలో భాగస్వామి అయిన వ్యక్తిగా టీడీపీ అధినేత చంద్రబాబుకు గుర్తుండే ఉండాలి కదా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
నిజానికి 1978వ సంవత్సరంలో ప్రభుత్వమే చికెన్ అమ్మింది. దానికి కారణం అప్పట్లో పౌల్టీ‍్ర రంగం అభివృద్ధి చెందలేదు. చికెన్ అంటే నాటుకోళ్లే. అలాంటి సమయంలో ప్రభుత్వమే పశువుల ఆస్పత్రిలో బాయిలర్ చికెన్ అమ్మింది. ప్రజలు మాంసం, గుడ్లు తినేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పౌల్ట్రీ కార్పోరేషన్ ఏర్పాటు చేసింది. తిరుపతిలోని మంచినీళ్ల కుంట దగ్గర కార్పోరేషన్ కార్యాలయం ఉండేది. అక్కడ ప్రతి రోజు గుండ్లు, చికెన్ అమ్మేవారు. మాంసం మాత్రం ఆదివారం లభించేంది. మంచి నాణ్యత కలిగి ఉండడంతో డిమాండ్ కూడా బాగుండేది. 1991 వరకూ ఈ కార్పొరేషన్ కొనసాగింది. టీడీపీ హయాంలో కూడా ఈ అమ్మకాలు కొనసాగాయి.
ప్రజల ఆరోగ్యం దృష్ట్య మంచి పౌష్టిక ఆహారం అందించడం అనే ఆలోచన మంచిదే. దాన్ని వ్యాపార కోణంలో కాకుండా ప్రజలకు ఉపయోగపడే అంశంగా చూస్తే మంచిదని నిపుణుల అభిప్రాయం. అయినా నిజంగానే ఏపీ ప్రభుత్వం మటన్ మార్టులను ఏర్పాటు చేస్తే దాంతో పెద్దగా ఆదాయం ఏమీ రాదు. కాకపోతే మంచి నాణ్యమైన మాంసం ప్రజలకి అందుతుంది. ఇదే సమయంలో ఉన్నత చదువులు లేక కూలీలుగా పని చేస్తున్న స్థానిక యువతకి ఉపాధి లభిస్తుంది. కానీ.., ఇంకా కార్యరూపం దాల్చని ఈ మటన్ మార్ట్స్ పై టీడీపీ అనవసరంగా విమర్శలు చేసి.., సెల్ఫ్ గోల్ చేసుకుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఈ మటన్ మార్ట్స్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.