త్రిపుర క్రైం- భారత్ లో క్రైం రేట్ పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలే. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా క్రైం రేట్ మాత్రం తగ్గడం లేదు. ఇక ప్రముఖులకు ఎంత భద్రత కల్పించినా వారిపైనా హత్యా యత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా త్రిపుర ముఖ్యమంత్రిపై హత్యా యత్నం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌ను హత్య చేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఐతే సకాలంలో స్పందించిన ఆయన సెక్యురిటీ సిబ్బంది వారి ప్రయత్యాన్ని అడ్డుకున్నారు. సీఎం బిప్లబ్ కుమార్ దేవ్ ను చంపడానికి ప్రయత్నించిన ముగ్గురుని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. త్రిపుర రాజధాని అగర్తలాలోని నివాసం దగ్గర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
సెక్యూరిటీ సిబ్బందిని దాటి ముఖ్యమంత్రి మీదకు ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. అప్రమత్తమైన సీఎం పక్కకు జంప్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టి, అదే రోజు రాత్రి కెర్చోవ్‌ముహాని ఏరియాలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితులకు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పీపీ పాల్ ఆగస్టు 19 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఐతే వారిని రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరినా కోర్టు అంగీరించలేదని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిద్యుత్ సూత్రధార్ చెప్పారు. ఐనప్పటికీ దర్యాప్తు అధికారులు జైలుకు వెళ్లి వారిని విచారిస్తారాని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి హత్యాయత్నం వెనుక ఎవరున్నారన్నదానిపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.