దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో బయటపడ్డ నకిలీ కొవిడ్ టీకా శిబిరాల బాధితులు దాదాపు 2 వేల మందికి పైగా ఉంటారని అధికారులు తేల్చారు. ఈ క్యాంపులపై ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదవగా, ఓ మహిళ సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా బాధితులకు ఈ ముఠా సెలైన్ లేదా ఉప్పునీటి వ్యాక్సిన్లు ఇచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ముంబయిలో మొత్తంగా 9 నకిలీ టీకా క్యాంపులు జరిగినట్లు., ఆ క్యాంపులను ఎనిమిది మంది సభ్యుల ముఠానీ అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి రూ.12.40 లక్షలు స్వాధీనం చేసుకున్నామని లా అండ్ ఆర్డర్ జాయింట్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. టీకాలు ఇచ్చేందుకు ముఠా వినియోగించిన కొవిషీల్డ్ వయల్స్‌ను గుజరాత్ నుంచి సేకరించారని వాస్తవంగా వాటిలో ఏమి నింపారో స్పష్టంగా చెప్పలేమని పోలీసు వర్గాలు చెప్తోన్న సమాచారం.
ముంబయిలోని కాందీవలిలో ఉన్న ఓ హౌసింగ్ సొసైటీలో గత వారం 390 మందికి టీకాలు వేశారు. కాగా వారిలో ఎవరికీ టీకా తీసుకున్న తర్వాత వచ్చే లక్షణాలు కనిపించలేదు. దీనికితోడు కొన్ని ఆసుపత్రుల నుంచి టీకా వేసుకున్నట్లు సర్టిఫికెట్లు వచ్చాయి. దీంతో అనుమానం వ్యక్తం చేసిన ఆ హౌసింగ్ సొసైటీ సభ్యులు సంబంధిత ఆసుపత్రులకు ఫోన్లు చేశారు. అయితే ఆ వ్యాక్సిన్లు వేసింది తాము కాదని ఆ ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముంబయిలోని మరో ఎనిమిది ప్రాంతాల్లోనూ ఎనిమిది మంది సభ్యుల ముఠా నకిలీ టీకా శిబిరాలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.