రాష్ట్ర ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల బాణాలు సంధిస్తున్న అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. తమ ఉన్నతాధికారుల సూచనల మేరకు రఘురామ అరెస్టుకు జవాన్లు సహకరించారు. ఆ వెంటనే రఘురామను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సొంత వాహనంలో వస్తానని రఘురామ చెప్పినా వినిపించుకోలేదు. ఆయనను బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. ఒక దశలో ఆయనను వాహనంలోకి బలవంతంగా తోసేశారు. ఎంపీ తనయుడు సీఐడీ పోలీసులను అడ్డుకోగా కోర్టులోనే తేల్చుకోండని స్పష్టం చేశారు. మందులు వేసుకోవాలని రఘురామకృష్ణరాజు గట్టిగా అరవడం వినిపించింది. అయినా… పట్టించుకోకుండా సీఐడీ పోలీసులు ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రికి ఆయనను గుంటూరుకు తీసుకొచ్చారు. ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి… రిమాండ్‌కు తరలించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇతరులతో కలసి కుట్రలు చేయడం (ఐపీసీ సెక్షన్ 120 బీ), ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం (124ఏ), ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా మాట్లాడటం (153ఏ), వ్యక్తిగత దూషణలు (505) తదితర అభియోగాల కింద అరెస్టు చేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు.
ఆ నోటీసును తీసుకునేందుకుగానీ సంతకం చేసేందుకుగానీ రఘురామ అంగీకరించలేదని, ఆయన భార్య రమాదేవి కూడా నోటీసు తీసుకునేందుకు నిరాకరించడంతో ఇంటి గోడకు అంటించామని పోలీసులు దానిపై రాశారు. ఆయనపై మంగళగిరి సీఐడీపోలీసులు కేసు (12/2021) నమోదు చేసినట్లు నోటీసులో ఉంది. రఘురామపై కేసు నమోదు, అరెస్టుకు సీఐడీ మూడు కారణాలు చూపించినట్లు తెలిసింది. అవేమిటంటే… 1) ముఖ్యమంత్రికి పిచ్చి పట్టింది… ఆయన విదేశాల్లో చికిత్స చేసుకున్నారు. 2) ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జలను ‘బిజ్జల’ అని సంబోధించారు. 3) ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కాదు, ఆయన కాపు. అంటూ కులాల మధ్య అంతరాలు సృష్టించారు. అని పేర్కొన్నట్లు సమాచారం.