నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశాడంటూ ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాదులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీలకు అతీతంగా రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను తప్పుబడుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుపై స్పందిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్పై ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సీఎం జగన్ రెడ్డి నియంత కంటే ఘోరంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. గత కొంతకాలంగా రఘురామకృష్ణరాజుకు, వైసీపీ పెద్దలకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆ యుద్ధం మరింత ముదిరింది. తాజా అరెస్టుతో అది పరాకాష్టకు చేరింది. ఈ అంశం పై రాఘురామ హైకోర్టు ఆశ్రయించగా ఈ రోజు విచారణ జరగనుంది. నరసాపురం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణరాజు ఏడాది తిరిగేలోగానే పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇటు పార్టీ తనను ఇబ్బంది పెడుతోందని ఆయన, ఆయనవల్ల పార్టీ దెబ్బతింటోందని నేతలు పేర్కొంటూ తొలినాళ్లలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇక, చివరికి పార్టీ అధినేత జగన్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టు కు ఎక్కే వరకు ఈ వివాదం ముందుకు సాగింది.
సినీనటి శ్రీరెడ్డి కేంద్రంగా ఇప్పుడు ఈ వివాదం యూటర్న్ తీసుకుంది. ఆమె టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, ఎంపీ రాజు కూడా అంతే తీవ్రస్థాయిలో రెచ్చిపోతున్నారు. ఈ వివాదం తాజాగా జాతీయ మీడియాలోనూ హైలెట్ అయింది. ఆయన్ను హైదరాబాద్లో ఆయన పుట్టిన రోజునే ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జాతీయ స్థాయి నేతలు సైతం అసలు ఏం జరుగుతోందని ఆరా తీస్తున్నారు. కృష్ణా.జిల్లాకు చెందిన ఒక ఎంపీకి ఫోన్ చేసి మరీ కొందరు నేతలు దీనిపై చర్చించినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు ఇరు పక్షాల మధ్య సాగుతున్న ఈ పొలిటికల్ వార్ ఎప్పుడు ముగుస్తుంది? ఎందాకా ఇది సాగుతుంది? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. వైసీపీ నేతలు చెబుతున్న దానిని బట్టి ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తేనే పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. కానీ, అధిష్టానం మాత్రం ఈ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేదని మరికొందరు అంటున్నారు.