మధ్యప్రదేశ్- దేశ ప్రధాని పర్యటన అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. అధికారుల హడావుడి, భద్రతా బలగాల మోహరింపు, నేతల హంగామా.. అబ్బో చాలా సందడి ఉంటుంది. సాధారనంగా ప్రధాని పర్యటన కొంత ఖర్చుతో కూడుకున్నదే అని చెప్పవచ్చు. ప్రత్యేక విమానం, హెలికాప్టర్లు, వాహనాలు.. ఇలా చాలా ఉంటాయి. ఐతే మన దేశ ప్రధాని మోదీ మధ్య ప్రదేశ్ లో చేయబోతున్న పర్యటన మాత్రం ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే కేవలం నాలుగు గంటల పాటు జరిగే ప్రధాని మోదీ పర్యటన కోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 23 కోట్లను ఖర్చు చేస్తోంది. భగవాన్ బిర్సా ముండా జ్ఞాపకార్థం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నవంబర్ 15న జన జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమాన్ని భోపాల్‌లోని జంబూరి మైదాన్ లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం కోసం మధ్య ప్రదేశ్ ప్రభుత్వం 23 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.
దేశంలోనే మొట్ట మొదటిసారి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. శివరాజ్ సింగ్ ప్రభుత్వం 13 కోట్ల ప్రజాధనంతో జంబోరీ మైదాన్ లో జరిగే కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వేదిక మొత్తం గిరిజన కళలు, గిరిజన ఇతిహాసాల చిత్రాలతో అలంకరించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 52 జిల్లాల నుంచి వచ్చే ప్రజల రవాణా, ఆహారం, వసతి కోసం మరో 12 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు.
మైదానంలో ఐదు గోపురాలు, గుడారాలు, అలంకరణ, ప్రచారానికి ఇంకో 9 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నాారట. ఓ వైపు గిరిజనుల కోసం పెద్ద సమావేశం పెడుతున్న బీజేపీ సర్కారు ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా షెడ్యూల్డ్ తెగలపై 2,401 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా చెబుతుండటం ఆసక్తికరంగా మారింది.