ఫిల్మ్ డెస్క్- పెళ్లంటే.. మూడు ముళ్లు, ఏడడుగులు, నూరేళ్లు. మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే జీవితంలో పెళ్లి ఒక్కసారే జరుగుతుంది. అందుకే వివాహ వేడుకకు అంత ప్రాధాన్యం ఇస్తారు అందరు. ఇక సినిమా వాళ్లు, సెలబ్రెటీల పెళ్లిలైతే చెప్పక్కర్లేదు. సినమా హీరో, హీరోయిన్ల పెళ్లిల్లపై అందరికి ఆసక్తి. ఇక సహజంగానే సినిమా వాళ్లు చాలా మంది కొన్నాళ్లకే విడాకులు తీసుకుంటున్న ఘటనలు మనం చూస్తున్నాం. ఇక ఇప్పుడైతే పెళ్లి వరకు కాదు, నిశ్చితార్దం అయ్యాక కూడా విడిపోతున్నారు హీరో, హీరోయిన్లు.
అలా పెళ్లి నిశ్చితార్దం అయ్యాక విడిపోయిన సినిమా జంటలను చూస్తే.. రీసెంట్ గా ఐతే హీరోయిన్ మెహరీన్‌కు భవ్యా బిష్ణోయ్ తో పెళ్లి కుదిరింది. గత మార్చిలో జైపూర్‌లో నిశ్చితార్ధాన్ని ఘనంగా నిర్వహించారు. మరి ఏమైందో ఏమో కాని సరిగ్గా మూడు నెలల తరువాత మెహరీన్ మనసు మార్చుకుంది. పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ఇందుకు సంబందించి శనివారం మెహరిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకు ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భవ్యా బిష్ణోయ్ తెలిపారు. మెహరీన్ జీవన ప్రయాణం బావుండాలని భవ్యా బిష్ణోయ్ ఆకాంక్షించారు. కానీ పెళ్లి క్యాన్సిల్ కావడానికి గల కారణాలను మాత్రం ఇద్దరు చెప్పలేదు.
కన్నడ సోయగం రష్మికా మందన్నాకు కూడా గతంలో పెళ్లి నిశ్చయం అయ్యింది. రక్షిత్ శెట్టితో రష్మికా మందన్నా ఏడడుగులు వేయాలనుకున్నారు. ఈ మేరకు బెంగళూరులో ఘనంగా నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ రష్మిక పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇక మరో హీరోయిన్ త్రిష జీవితంలోను ఇదే విధంగా జరిగింది. చెన్నై వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థమైన కొన్నాళ్లకు ఇద్దరూ విడిపోయారు. వీళ్ల విషయంలో ఏంజరిగిందో కూడా బయటకు తెలియనివ్వలేదు. ఇక అఖిల్ అక్కినేని కూడా నిశ్చితార్థం తర్వాత పెళ్లిని రద్దు చేసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలుతో నిశ్చితార్దం జరిగాక ఏంజరిగిందో కాని అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.
ఇక దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార గతంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో వాళ్లిద్దరికీ నిశ్చితార్థమైందన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ తరువాత వారి విడిపోవడం, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో నయనతార ప్రేమలో పడటం జరిగిపోయాయి. ఇక తమిళ హీరో విశాళ్ కు హైదరాబాదీ అమ్మాయి అనీషారెడ్డితో నిశ్చితార్ధం అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో కాని విశాళ్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇలా సినిమా వాళ్ల నిశ్చితార్ధాలు పెళ్లి వరకు వెళ్లకపోవడానికి కారణాలేంటోనని అభిమానులు ఆలోచిస్తున్నారు.