ఈ రోజుల్లో మనుషుల్లో స్వార్థం, ఇగో, ఆధిపత్య ధోరణి ఎక్కువయ్యి.. ఇద్దరు వ్యక్తుల పలకరింపులు కరువయ్యాయి. తమ ఎదురుగా ఎవరు నివసిస్తున్నారో కూడా తెలియడం లేదు. సాయం అడిగినా చేయడం లేదు. కానీ ఆశా జ్యోతిలా ఎవరో ఒకరు అడగకపోయినా సాయం చేసి మానవత్వం ఇంకా మిగిలి ఉందని నిరూపిస్తుంటారు.
‘మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు’కవి అన్నదీ అక్షర సత్యం. ఈ రోజుల్లో మనుషుల్లో స్వార్థం, ఇగో, ఆధిపత్య ధోరణి ఎక్కువయ్యి.. ఇద్దరు వ్యక్తుల పలకరింపులు కరువయ్యాయి. తమ ఎదురుగా ఎవరు నివసిస్తున్నారో కూడా తెలియడం లేదు. తమ పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. చివరకు మనిషి చావు బతుకుల్లో ఉంటే.. గుక్కెడు నీళ్లు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. కానీ ఆశా జ్యోతిలా ఎవరో ఒకరు అడగకపోయినా సాయం చేసి మానవత్వం ఇంకా మిగిలి ఉందని నిరూపిస్తుంటారు. ఆ చిన్నారి విషయంలో ఇదే నిజమైంది.
తల్లి ఆసుపత్రి పాలైతే.. తండ్రి చెప్పా పెట్టకుండా ఏటో వెళ్లిపోయాడు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆరేళ్ల కుమారుడు ఆసుపత్రి బయట దీన స్థితిలో కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌లోని సలూర క్యాంపుకు చెందిన గంగాధర్, మాధవి భార్యా భర్తలు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. మాధవి రెండో సారి గర్భం దాల్చింది. నెలలు నిండటంతో ఈ నెల 1వ తేదీన ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చి అడ్మిట్ చేశాడు. అయితే డెలివరీ సమయంలో పుట్టిన శిశువు చనిపోగా.. మాధవి అపస్మార స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. భర్త గంగాధర్.. కుమారుడు సాత్విక్‌ను ఆసుపత్రి దగ్గర వదిలేసి.. ఎటో వెళ్లిపోయాడు.
తండ్రి తిరిగి రాలేదు. తల్లికి ఏమైందో తెలియదు. దీంతో ఆరేళ్ల పసివాడు సాత్విక్ అక్కడే ఒంటరిగా తిరుగుతూ కనిపించాడు. మంగళవారం అర్ధరాత్రి సాత్విక్ ఆసుపత్రిలో ఒంటరిగా తిరుగుతుండగా సెక్యూరిటీ సిబ్బంది గమనించి..ప్రశ్నించగా..బాలుడు సరిగ్గా వివరాలు చెప్పలేకపోయాడు. అమ్మ ఇక్కడే ఉందని, నాన్న బయటకు వెళ్లాడంటూ చెప్పాడు. వివరాలు కనుక్కుని సాత్విక్‌ను తల్లి మాధవి దగ్గరకు తీసుకువెళ్తే అపస్మారక స్థితిలో ఉండడంతో ఆమె గుర్తు పట్టడం లేదు. దీంతో మూడు రోజులుగా సెక్యూరిటీ క్యాబిన్లో ఆశ్రయం కల్పించి టిఫిన్, భోజనం పెడుతున్నామని సెక్యూరిటీ చీఫ్ శివాజీ తెలిపారు. బాలుడి తల్లికి కూడా ఆసుపత్రి పేషంట్ కేర్ సిబ్బంది సపర్యలు చేస్తున్నారు.