ఇంటర్నేషనల్ డెస్క్- ఈ విశ్వంలో అందరికి మామ చందమామ. అవును మనం చిన్నప్పుడు చంద మామను చూస్తూ పెరిగాం. ఇప్పుడు చందమామను చూస్తూనే ఉన్నాం. ఐతే ఇప్పుడు చందమామపైకి వెళ్లేంత ఎదిగిపోయాం.ఇదిగో ఇప్పుడు ఆ చందమామకు సంబంధించిన ఆసక్తికరమైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా షేర్ చేసిన ఈ ఫొటో చూస్తే మాత్రం, అరే ఇది మన చందమామ ఫోటోనేనా అని అనుకోకుండా ఉండలేం.
సాధారనంగా చందమామ దూరం నుంచి తెల్లగా, దగ్గరకెళ్తే బూడిద రంగులో కనబడుతుంది. ఐతే తాజాగా నాసా షేర్ చేసిన చందమామ ఫోటోలో మాత్రం రంగురంగుల హరివిల్లులు కనిపిస్తున్నాయి. 1989 అక్టోబర్ 18న నాసా అట్లాంటిస్ అనే స్పేస్ షటిల్‌ను ప్రయోగించిన సంగతి తెలుసు కకదా. ఈ స్పేస్ షటిల్ సాయంతో గెలీలియో అనే ఉపగ్రహాన్ని గురు గ్రహం వద్దకు పంపింది నాసా.
అలా వెళ్లే క్రమంలో గెలీలియో ఉపగ్రహం చందమామ ఉత్తర ధృవానికి సంబంధించిన కొన్ని ఫొటోలను తీసింది. ఈ చిత్రాలన్నింటిని కలిపితే చందమామ ఫాల్స్ కలర్డ్ మొజాయిక్ చిత్రం రెడీ అయిందని నాసా స్పష్టం చేసింది. ఆశ్చర్యం కలిగించే ఈ ఫొటోలో చంద్రుడిపై అనేక రంగుల ప్రాంతాలు కనిపిస్తున్నాయి. వీటిలో గులాబీ రంగులో ఉన్న ప్రాంతంలో ఎత్తైన కొండలను తలపిస్తుండగా, నీలం నుంచి నారింజ రంగు వలయాలు కూడా కనిపిస్తున్నాయి.
చంద్రుడిపై పురాతన కాలంలో లావా పొంగిన ప్రదేశాన్ని ఇది తెలియజేస్తోంది. ముదురు నీలం రంగు ఉన్న ప్రాంతంలో అపోలో-11 నౌక ల్యాండయిందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేర్కొంది. భలేగా ఉంది కదా. మరి మీరు కూడా ఈ ఫోటోను చూసి చందమామ అందాలను ఎంజాయ్ చేసెయ్యండి.