న్యూ ఢిల్లీ- భారత వాతావరణ శాఖ రైతులకు చల్లని శుభవార్త చెప్పింది. అనకున్న ప్రకారమే జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు ఐఎండీ తెలిపింది. ఈ యేడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా రైతులకు మేలు జరుగుతుందని ఐఎండీ నిపుణులు చెబుతున్నారు. ఇది ముందస్తు అంచనా మాత్రమేనని, ఈ నెల 15న రుతుపవనాల రాక, 31న వర్షపాతంపై వాతావరణ శాఖ అధికారిక ప్రకటన చేస్తుందని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్ స్పష్టం చేశారు. ఈ సారి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకే అవకాశం ఉందని ముందస్తు విశ్లేషణలు సూచిస్తున్నాయని ఆయన తెలిపారు.
ఇది సాధారణ రుతుపవన ఏడాది అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు రాజీవన్ చెప్పారు. దీర్ఘకాలిక సగటు లో ఈ ఏడాది 98 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏప్రిల్ 16న భారత వాతావరణశాఖ తన ముందస్తు సూచనలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంచనాల్లో 5 శాతం అటూ ఇటుగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో వరుసగా రెండేళ్లు సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిశాయి. ఈసారి మాత్రం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మొత్తానికి ఐఎండీ రైతులకు చల్లని కబురు చెప్పిందని సంతోషం వ్యక్తం అవుతోంది.