తూర్పుగోధావరి- ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా ఆహ్లాదంగా ఉన్నా, అక్కడి రోడ్డు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. అంతే కాదు తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులను సీతక్క ఖండించారు. అధికారం శాశ్వతం కాదని ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు ఏవైనా నియంతృత్వ ధోరణి మంచిది కాదని ఆమె హితవు పలికారు.
ఈ వ్యాఖ్యలను ఆమె ఏకంగా ఆంద్రప్రదేశ్ కు వెళ్లి మరీ చేశారు. టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడుల విషయంలో సీఎం జగన్, వైసీపీ నేతల వైఖరిని తీవ్రంగా ఖండించారు సీతక్క. ఆంధ్రా అమ్మాయికి, తెలంగాణ అబ్బాయికి జరిగిన పెళ్లికి ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమండ చెరుకూరి వీర్రాజు కళ్యాణ మంటపంలో జరిగిన శుభకార్యంలో ఆమె పాలుపంచుకున్నారు.
రాష్ట్రాలు విడిపోయినా తెలుగు వారమంతా ఒక్కటేనని ఈ సందర్భంగా సీతక్క అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మురమండ గ్రామానికి చెందిన గారపాటి వీరాస్వామి మనవరాలితో, ములుగు నియోజకవర్గానికి చెందిన యువకుడికి వివాహం జరిగింది. పెళ్లి కొడుకు ఆహ్వానం మేరకు వివాహానికి హాజరైనట్లు సీతక్క తెలిపారు. అతిథి మర్యాదలకు పెట్టింది పేరు ఆంధ్రా అని ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలంటే తనకు గౌరవమన్నారు.
ఐతే కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన సీతక్క, ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నాయకులపై జరిగిన దాడిని ఖండించడం, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది. అన్నట్లు మొన్న రాఖీ పండగ సందర్బంగా సీతక్క, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లి రాఖీ కట్టడం కూడా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.