హైదరాబాద్- తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికి తెలుసు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ఆమె దీక్షను ఎద్దేవా చేస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కొత్తగా మంగళవారం మరదలు బయలుదేరిందంటూ వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. షర్మిలపై నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌టీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. అంతే కాదు సొంత టీఆర్ ఎస్ పార్టీ నేతలు సైతం నిరంజన్ రెడ్డి షర్మిలపై చేసిన వ్యాఖ్యలను అంతర్గతంగా తప్పుబట్టారు. దీంతో కాస్త దిగొచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి వైఎస్ షర్మిలకి క్షమాపణ చెప్పారు.
వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. షర్మిలపై చేసిన వ్యాఖ్యలు తొందరపాటు చర్య అని అయన అన్నారు. తన వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతింటే సారీ అని మంత్రి అన్నారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పరుష పదజాలంతో వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారంటూ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ కూతురు కవిత ఏమవుతుందో చెప్పాలంటూ నిలదీశారు. మరిప్పుడు మంత్రి నిరంజన్ రెడ్డి ఓ మెట్టు దిగివచ్చి షర్మిలకు క్షమాపణ చెప్పారు కాబట్టి ఈ వివాదం సమసిపోయినట్టేనని అనుకుంటున్నారు.