తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తృటిలో పెను ప్రమాదం తప్పింది. చెర్లబూట్కూరులో పర్యటించిన మంత్రి.. వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై మాట్లాడేందుకు వెళ్లగా ప్రమాదం జరిగింది.
ఇటీవల బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సమావేశాలు ప్రమాద స్థలాలుగా మారిపోతున్నాయ. ఇటీవల ఖమ్మంలోని కారేపల్లి మండలం చీమలపాడులో ఆత్మీయ సమ్మేళనం జరుగుతుండగా.. బాణాసంచా పేలి ఒక గుడిసెపై పడింది. దీంతో అందులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మర్చిపోక ముందే మరో అపశృతి చోటుచేసుకుంది. తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్‌లో చెర్లబూట్కూరులో ఏర్పాటు చేసిన సభా వేదిక ఒక్క సారిగా కూలిపోయింది.
చెర్లబూట్కూరులో పర్యటించిన మంత్రి.. వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై మాట్లాడేందుకు వెళ్లారు. అయితే అదీ కుప్ప కూలిపోవడంతో మంత్రుల గంగులతో పాటు ఇతర నేతలు కింద పడిపోయారు. దీంతో మంత్రి కమలాకర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆయనను సమీపంలోని మహావీర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయన కాలికి గాయమైంది. అలాగే ఓ జడ్పీటీసీ కాలు విరిగింది. ఆయనను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు. అయితే సభా వేదిక పైకి పరిమితికి మించి నాయకులు ఎక్కడంతోనే వేదిక కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. తనకు చిన్న గాయమైందని, వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారని మంత్రి వెల్లడించారు. విశ్రాంతి తీసుకోవలసిందిగా వైద్యులు సూచించారన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని ఓ ప్రకటన వెలువడింది.