జీవితంలో కష్టపడితే సాధించలేనిది అంటూ ఏమి ఉండదు అంటారు. ఇదే మాటని కాస్త సినిమాటిక్ గా చెప్పుకోవాలంటే.. ఎంత కష్టానికి, అంత ఫలితం అంటారు. ఈ విషయాన్ని మరోసారి నిజం చేసి చూపించింది ఓ తెలంగాణ బిడ్డ. పూర్తిగా చదువు కూడా పూర్తి కాకుండానే సంవత్సరానికి రూ.2 కోట్ల జీతం వచ్చే జాబ్ కి సెలెక్ట్ అయ్యి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.., హైదరాబాద్కు చెందిన నర్కుటి దీప్తి అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా రూ.2 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. దీప్తి ముందుగా ఎంఎస్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం కష్టపడి చదివి యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరెడాలో సీటు సంపాదించింది. అలా సీటు వచ్చిన తరువాత మూడేళ్ళ పాటు కష్టపడి చదివి యూనివర్సిటీ స్థాయిలో మంచి ర్యాంక్ దక్కించుకుంది.అలా దీప్తి అనుకున్నట్టుగా అమెరికాలో ఎంఎస్ కంప్యూటర్స్ ఈ నెల 2తో పూర్తి చేసింది. కానీ.., ఇంతకన్నా ముందే యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరెడాలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దీప్తికి మైక్రోసాఫ్ట్, గోల్డ్ మెన్ సాక్స్, అమేజాన్ కంపెనీల్లో ఉద్యోగం వచ్చింది. ఈమె మాత్రం మైక్రోసాఫ్ట్ సంస్థ వైపే మొగ్గు చూపారు. దీప్తి ప్రతిభను గుర్తించిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ గా గ్రేడ్–2 కేటగిరీలో ఎంపిక చేసుకుంటూ రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజ్ ఇచ్చారు. గతంలో క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఇంత పెద్ద మొత్తం శాలరీతో జాబ్ తెచ్చుకున్నవారు ఎవ్వరూ లేకపోవడం విశేషం. దీనితో దీప్తి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. తన కష్టానికి తగ్గ ఫలితం అందిందని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది. త్వరలోనే దీపుతో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక దీప్తి తండ్రి, ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ వెంకన్న హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లోని క్లూస్ టీమ్స్కు నేతృత్వం వహిస్తుండటం విశేషం. ఏదేమైనా.. విద్యార్థి దశలో కష్టపడి చదివితే ఎంతటి విజయాన్ని సొంతం చేసుకోవచ్చో దీప్తి నిజం చేసి చూపించిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.