గాడ్జెట్ డెస్క్- స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇది లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేము. చేతిలోకి స్మార్ట్ పోన్ తీసుకున్నాకే ఏ పనైనా మొదలుపెట్టేది. ప్రపంచం మన చేతుల్లో ఉండాలంటే స్మార్ట్ ఫోన్ మన దగ్గర ఉండాల్సిందే. స్మార్ట్ ఫోన్ తరువాత ఇప్పుడు అందరు ఆసక్తి చూపిస్తున్నది స్మార్ట్ వాచ్ పై. ఇప్పుడు చాలా మంది స్మార్ట్ వాచ్ ను ధరిస్తున్నారు. ప్రధానంగా ఆరోగ్యంపై శ్రద్ద, ఫిట్ నెస్ వివరాలు తెలుసుకునే వాళ్లంతా స్మార్ట్ వాచ్ ను కొంటున్నారు. ఇక మార్కెట్లోకి అడ్వాన్స్ టెక్నాలజీతో రక రకాల స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి.
తాజాగా ఎంఐ రివాల్వ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్‌ను షియోమీ లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన ఎంఐ వాచ్ రివాల్వ్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ వాచ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంఐ వాచ్ రివాల్వ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్‌లో బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ మానిటరింగ్ కూడా ఉండనుంది. ఈ స్మార్ట్ వాచ్ లో 1.39 అంగుళాల ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేను పొందుపరిచారు. దీని రిజల్యూషన్ 454×454 పిక్సెల్స్‌గా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ బరువు కేవలం 32 గ్రాములు మాత్రమే. వెనకవైపు మ్యాగ్నటిక్ చార్జింగ్ పోడ్‌ను కూడా అందించారు. ఇందులో మొత్తంగా 117 స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం విశేషం. యోగా, ట్రయథ్లాన్, స్విమ్మింగ్, హెచ్ఐఐటీ వంటి ప్రొఫెషనల్ వర్కవుట్ మోడ్స్ కూడా ఈ వాచ్ లో ఉన్నాయి.
ఇందులో 12ఎన్ఎం ప్రాసెస్ ఎయిరోహ జీపీఎస్ చిప్‌ను అమర్చారు. జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బీడీఎస్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఎంఐ వాచ్ రివాల్వ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్ చూడటానికి ఎంఐ వాచ్ రివాల్వ్ తరహాలోనే ఉంది. సిలికాన్ స్ట్రాప్‌లు కూడా ఇందులో అందించారు. ఇందులో ఎస్‌పీఓ2 మానిటరింగ్ కూడా ఉంది. స్లీప్ యాప్నియా, కోవిడ్-19, ఊపిరితిత్తుల వ్యాధుల లక్షణాలను గుర్తించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వీఓ2 మ్యాక్స్ సెన్సార్ ద్వారా వర్కవుట్ చేసేటప్పుడు ఆక్సిజన్ వినియోగాన్ని తెలుసుకోవచ్చన్నమాట. ఈ స్మార్ట్ వాచ్ లో 420 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. ఒక్కసారి చార్జ్ చేస్తే మొత్తం 14 రోజుల బ్యాటరీ వస్తుంది.
ఇక పూర్తిగా చార్జ్ అవ్వడానికి కేవలం రెండు గంటల సమయం మాత్రమే పడుతుంది. బాడీ ఎనర్జీ మానిటర్, కాల్, టెక్ట్స్ నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోల్, ఇన్ బిల్ట్ అలెక్సా సపోర్ట్, స్టాప్ వాచ్, అలారం, టైమర్, ఫైండ్ మై ఫోన్, ఫ్లాష్ లైట్ వంటి ఫీచర్లన్నీ ఈ వాచ్ లో ఉన్నాయి. ఎంఐ వాచ్ రివాల్వ్ యాక్టివ్ ధర మన దేశంలో 9,999 రూపాయలుగా ఉంది. జూన్ 25వ తేదీ నుంచి ఈ వాచ్ మార్కెట్ లో అందుబాటులోకి రానుంది. అమెజాన్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రారంభ ఆఫర్ కింద దీన్ని 8,999 రూపాయలకే అందిస్తున్నారు.