తెలుగు, తమిళ బాషల్లో విడుదలకు సిద్దమవుతున్న ‘క్లాప్’ సినమా టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆది పినిశెట్టి అథ్లెట్‌గా నటిస్తోన్న చిత్రం ‘క్లాప్’ మూవీని రామాంజనేయులు జవ్వాజీ మరియు రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఐబి కార్తికేయన్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, పృథ్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ‘క్లాప్’ టీజర్‌ను సోమవారం చిరంజీవి విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
తన స్నేహితుడు, దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి ఒక బహుముఖ నటుడని ఈ సందర్బంగా చిరంజీవి అన్నారు. అతన్ని తమ ఫ్యామిలీ మెంబర్ గా భావిస్తామని చెప్పారు. ఈ సినిమా కోసం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ తీసుకోవడం అద్భుతమైన ఆలోచన అని, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం ఆడియన్స్‌ని నిరాశపరచలేదని చిరంజీవి వ్యాఖ్యానించారు. టీజర్ చూస్తుంటే ‘క్లాప్’ కూడా ఒక అథ్లెట్ ఫిలిం అనిపిస్తుందని కామెంట్ చేశారు.
ఆది పినిశెట్టి ఒక ఛాలెంజింగ్ పాత్ర పోషించాడని తెలుస్తోందని అన్నారు. ఇక మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నానని చిరంజీవి చెప్పారు. టీజర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవికి చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. దేవదాసు ఫేం ఆకాంక్ష సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక టీజర్ లోకి వెళ్తే.. నాపేరు విష్ణు.. నాకు తెలిసిందల్లా.. అంటూ రన్నింగ్ రేస్ లో పరిగెడుతుంటాడు ఆది పినిశెట్టి. ఓ సందర్బంలో.. కొంచెం టాలెంట్.. రెండు కాళ్లు ఉంటే గెలిచేస్తారా అంటూ బ్రహ్మాజీ ఆదిని ఎగతాళి చేస్తాడు. అటు హీరోయిన్ ఆకాంక్ష.. చూస్తా.. నా చుట్టూ ఎన్నాళ్లు ఇలా తిరుగుతావో అని కామెంట్ చేస్తుంది. అన్నట్లు ఈ సినిమాలో నాజర్, ప్రకాష్ రాజ్ లాంటి భారీ తారాగణం ఉంది. మరింకెందుకు ఆలస్యం.. మీరూ ‘క్లాప్’ సినిమా టీజర్ ను చూసెయ్యండి.