ఫిల్మ్ డెస్క్- మీలో ఎవరు కోటీశ్వరుడు… ఈ క్విజ్ కార్యక్రమం ఎంత పాపులర్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతీ పేరిట నిర్వహించిన కార్యక్రమం బారీగా సక్సెస్ అయ్యింది. హిందీ షో కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరించారు. ఒకరకంగా చెప్పాలంటే కౌన్ బనేగా కరోడ్ పతి షో కు అమితాబే పాపులారిటీ తీసుకువచ్చారని చెప్పవచ్చు. ఇక హిందీలో సక్సెస్ అయిన ఈ కార్యక్రమాన్ని పలు ప్రాంతీయ బాషల్లోను చేపట్టారు. మన తెలుగులోను మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో మా టీవాలో ప్రసారం అయ్యింది. తెలుగులోను మంచి పాపులారిటీనీ సంపాదించుకుంది మీలో ఎవరు కోటీశ్వరుడు. గతంలో టాలూవుడ్ అందగాడు అక్కినేని నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. ఆయన ఈ షోను బాగానే నడిపించారన్న పేరు వచ్చింది.
ఇక ఇప్పుడు మీలో ఎవరు క్విజ్ షోకు జూనియర్ ఎన్టీఆర్ ను ఎంపిక చేశారు నిర్వాహకులు. దీనికి కాస్త పేరు మార్చి ఎవరు మీలో కోటీశ్వరులు అని టైటిల్ పెట్టారు. రెండు నెలల క్రితం ఈ రియాలిటీ షోను గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు నిర్వాహకులు. ఈనెల చివరి వారం నుంటి మా టీవీలో ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మేరకు గత కొన్ని రోజులుగా ఎవరు మీలో కోటీశ్వరులు షోకు సంబందించిన ఎన్టీఆర్ ప్రోమో వస్తోంది. దీంతో ప్రేక్షకులతో పాటు, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఈ షో ప్రసారం అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఐతే ఎవరు మీలో కోటీశ్వరుడు వీక్షకులకు నిరాశ చెందే న్యూస్ బయటకు వచ్చింది.
ఎవరు మీలో కోటీశ్వరులు ఈ ఏడాది లేనట్టే అన్న ప్రచారం జరుగుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ముందు నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అదే నిజమైయిందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. తాజా సమాచారం మేరకు కరోనా కేసులు తగ్గితే ఎవరు మీలో కోటీశ్వరులు ఈ ఆగస్టు నుంచి ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇక కరోనా ఉధృతి తగ్గకపోతే మాత్రం ఈ ఏడాది పూర్తిగా షో నిలిపివేయాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిత ప్రకటన వెలువడనుందట. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.