స్పెషల్ డెస్క్- కరోనా.. ఇప్పుడు ఈ పేరు తప్ప మరేం వినిపించడం లేదు. కరోనా పేరు వింటేనే అందరికి వెన్నులో వణుకు వచ్చేస్తోంది. ఫస్ట్ వేవ్ లో భారత్ పై అంతగా ప్రభావం చూపని కరోనా మహమ్మారి, సెకండ్ వేవ్ లో మాత్రం విజృంభించేస్తోంది. దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సెకండ్ వేవ్ తరువాత మళ్లీ ధర్డ్ వేవ్ ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అంటూ కొత్త కొత్త వైరస్ లు దాడి చేస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోననే కంగారు మొదలైంది. ఇక కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. అయినప్పటికీ ధైర్యంగా, అంకిత భావంతో వారు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్లు ఎందో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో వైద్యులు కాకుండా రోబోలు కరోనా రోగులకు వైద్యం అందిస్తే ఎలా ఉంటుంది. భలే ఉంది కదా ఈ ఆలోచన.
ఇలాంటి ఆలోచన వచ్చిందే తడవుగా ఓ విద్యార్ధిని రోబో డాక్టర్ ను రూపొందించేసింది. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా.. ఐతే మనం బిహార్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని తయారు చేసిన డాక్టర్ రోబో గురించి తెలుసుకోవాల్సిందే. బీహార్ కు చెందిన ఇంజినీరింగ్ విధ్యార్ధిని ఆకాంక్షకు వైద్యులపై జాలి కలిగింది. ప్రతి రోజు కరోనా రోగులకు వైద్యం అందించే చాలా మంది డాక్టర్లు వైరస్ బారిన పడటం, అక్కడక్కడ వైద్యులు చనిపోవడం ఆమెను కలిచివేసింది. దీంతో వారి కోసం ఏదైనా చేయాలని ఆకాంక్ష భావించింది. అలాంటి ఆలోచనలో పుట్టిందే మెడి రోబో. ఆకాంక్ష వాళ్ల నాన్నతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది. తాను అభివృద్ధి చేసిన ఈ రోబో వల్ల వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిలో కొందరి ప్రాణాలైనా నిలబడతాయని ఆశిస్తున్నానని చెప్పింది ఆకాంక్ష. ఈ రోబోను రిమోట్ సాయంతో ఎక్కడికి కావాలంటే అక్కడికి కదిలించవచ్చు. రియల్ టైమ్ డేటాను అనుసంధానించి వైరస్ సోకినవారికి ఈ మెడి రోబో ప్రాథమిక వైద్య పరీక్షలు చేస్తుంది. దీని సాయంతో రక్తంలో గ్లూకోజ్, ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించవచ్చు.
కరోనా రోగి హార్ట్ రేట్, బాడీ టెంపరేచర్, బీపీ, బరువు, ఈసీజీ వంటివి కూడా వైర్ లెస్ స్టెతస్కోప్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చని ఆకాంక్ష తన రోబో పనితీరును వివరించింది. అంటే వైద్య సిబ్బందితో ఏ మాత్రం పని లేకుండా ఈ మెడి రోబో పేషెంట్‌కు అన్ని రకాల ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ఫలితంగా ఎవరూ బాధితుల దగ్గరకు నేరుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతే కాదు కరోనా రోగులకు వేళకు మందులు, ఆహారం, మంచినీళ్ల వంటివి ఇవ్వడం, నిరంతరం ఆక్సిజన్ మానిటరింగ్, నెబులైజేషన్ వంటి సేవలు కూడా అందిస్తుంది. ఈ మెడి రోబో 360 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. దీనికి అత్యాధునిక హైరిసొల్యూషన్ విజన్ కెమెరాను అమర్చారు. దీని ద్వార కరోనా పేషెంట్‌తో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించుకోవచ్చు. దీని వల్ల వైరస్ బాధితులను వైద్యులు రియల్ టైమ్‌లో పరీక్షించి, మందులు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆకాంక్ష రూపొందించిన మెడి రోబో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దృష్టిలో పడింది. ఆయన ఆకాంక్షను వ్యక్తిగతంగా ఆహ్వానించి, అభినందించారు. ఈ రోబో అభివృద్ధికి అవసరమైన మద్దతు, సహకారాన్ని అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.