ఐఐఎంలో ఎంబీఏ చేయాలన్నది ఆ కుర్రాడి కల.. అది నెరవేరలేదు. అదే పేరుతో ఒక చాయ్ దుకాణం పెట్టాడు. ఎంబీఏ చేసుంటే మహా అయితే ఒక ఉద్యోగి అయ్యేవాడు. కానీ, ఆ చాయ్ దుకాణంతో అతను ఏకంగా కోటీశ్వరుడు అయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు.. దేశవ్యాప్తంగా అతనికి 22 చాయ్ స్టాల్స్ ఉన్నాయి. త్వరలోనే విదేశాల్లోనూ వ్యాపారం మొదలు పెడతా నంటున్నాడు. మరి అతని కథేంటో చూసేయండి.
మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫుల్ బిల్లోర్‌కి ఐఐఎంలో ఎంబీఏ చేయాలన్నది కల. అందరిలానే అతనుకూడా మూడేళ్లపాటు కామన్ అడ్మిషన్ టెస్టుకు ప్రిపేర్ అయ్యాడు. కుస్తీపట్టినా అందులో విజయం సాధించలేకపోయాడు. మూడుసార్లు CATలో విఫలంకావడంతో ఇంక ఆ ప్రయత్నానికి ఫుల్‌స్టాప్ పెట్టి వ్యాపారం చేయాలనుకున్నాడు. తండ్రిని అడిగి చదువు కోసమని రూ.10 వేలు తీసుకున్నాడు. ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి అహ్మదాబాద్ ఐఐఎం సమీపంలో MBA చాయ్ వాలా అంటూ ఒక స్టాల్ ప్రారంభించాడు. విద్యార్థులతో ఇంగ్లీష్‌లో మాట్లాడటం, అతని వ్యాపారం వైవిద్యంగా ఉండటంతో బాగా క్లిక్ అయ్యింది. కొన్నాళ్లకు మున్సిపల్ అధికారులు ఆ దుకాణాన్ని తొలగించారు.
ఒక ఆస్పత్రి సమీపంలో ఒక స్టాల్ ప్రారంభించాడు. ఆ స్టాల్ కాస్తా.. టీ హౌస్‌గా మారింది. అతని వ్యాపార వ్యూహాలు కూడా ఎంతో విభిన్నంగా ఉంటాయి. అందరూ వెళ్లే వెళ్లేందుకు ప్రఫుల్ ఇష్టపడడు. ఉద్యోగులు, నిరుద్యోగులకు బాగా కనెక్ట్ అయ్యేలా.. కొటేషన్స్ కూడా పెడుతుంటాడు. ఇప్పటికీ ప్రఫుల్ తండ్రి పూజాసమాగ్రి దుకాణం నిర్వహిస్తున్నారు. తన కుమారుడి విజయాన్ని చెబుతూ మిగిలిన తల్లిదండ్రులు కూడా వారికి నచ్చిన పని చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచిస్తుంటాడు ప్రఫుల్ తండ్రి.