ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 10వ తేదీన ‘మా’ ఎన్నికలు నిర్వహించాలని సినీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఎలక్షన్స్ పై గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో వివాదం చలరేగుతోంది. ప్రస్తుత కమిటీ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగిసిపోయింది.
దీంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి, వెంటనే ‘మా’ ఎన్నికలు జరపాలని క్రమశిక్షణా సంఘానికి లేఖ రాశారు. కొత్త కమిటీ ఏర్పాటు కాకపోవటం వల్ల పలు సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయని చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు. వెంటనే ‘మా’ ఎన్నికలు జరిపి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని కృష్ణంరాజును చిరంజీవి కోరారు.
ఈ క్రమంలో ‘మా’ ఎన్నికలపై కదలిక వచ్చింది. అందులో భాగంగానే అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు నిర్వహించాలని సినీ పెద్దలు నిర్ణయించారు. ఇక ‘మా’ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ సారి చాలా మంది ‘మా’ ఎన్నికల్లో పోటీకి నిలబడుతున్నారు. ‘మా’ ఎన్నికల నేపధ్యంలో తెలుగు సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది. ఏ వర్గం ఎవరికి సపోర్ట్ చేస్తుందన్నదానిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి.
అందులో ప్రధానంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజేశఖర్, సీవీఎల్ నరసింహ రావు తదితరులు ‘మా’ బరిలో ఉన్నారు. మరి కొంత మంది సైతం ‘మా’ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సారి ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయని పరిశ్రమలో చర్చ జరుగుతోంది.