గతంలో పచారీ సరుకులు హోల్ సేల్ గా తెచ్చుకోవాలంటే పెద్ద మార్కెట్‌కు వెళ్లేవాళ్లు. అక్కడ నెలకు సరిపడా సరుకులన్నీ కట్టించుకుని, వాటిని ఆటోలో వేసి ఇంటికి తెచ్చుకునే వాళ్లు. అయితే ఇప్పుడు పెద్ద యెత్తన మార్ట్స్ ఇళ్లకు సమీపంలోనే వెలిసి పోవడంతో
గతంలో పచారీ సరుకులు హోల్ సేల్ గా తెచ్చుకోవాలంటే పెద్ద మార్కెట్‌కు వెళ్లేవాళ్లు. అక్కడ నెలకు సరిపడా సరుకులన్నీ కట్టించుకుని, వాటిని ఆటోలో వేసి ఇంటికి తెచ్చుకునే వాళ్లు. అయితే ఇప్పుడు పెద్ద యెత్తున మార్ట్స్ ఇళ్లకు సమీపంలోనే వెలిసి పోవడంతో వారానికి, పది రోజులకొకసారి సరుకులు తెచ్చుకుంటున్నారు. రత్నదీప్, విశాల్ మార్ట్, స్పెన్సర్, రిలయన్స్ వంటి మార్టుల రూపంలో అన్ని వస్తువులు ఒకే చోటే దొరికేస్తుండటంతో మహిళలంతా వాటికే క్యూ కడుతున్నారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా వచ్చిందే డీ మార్ట్. ఇందులో తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు లభిస్తాయన్న మౌత్ పబ్లిషిటీ కారణంగా చాలా మంది డీ మార్టును ఆశ్రయిస్తుంటారు.
డీ మార్ట్.. ఈ పేరు తెలియని మధ్య తరగతి నారీమణి బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరకులను తెచ్చుకునేది ఇక్కడ నుండే. ఇక్కడ ఆఫర్ల ధరల్లో సరుకులు దొరుకుతుండటంతో చాలా మంది ఈ మార్ట్‌కు వస్తుంటారు. అయితే డీమార్ట్ వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. మొన్నటికి మొన్న డీ మార్ట్ సిబ్బంది.. ఒకే వస్తువుకు రెండుసార్లు బిల్లు వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా విజయవాడలో మరో మోసం బయటకు పొక్కింది. పటమటలో ఉన్న డీ మార్ట్ కు కొనుగోలు చేసేందుకు వెళ్లిన కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. బాదం పప్పు కొనుగోలు చేయగా.. డిస్ ప్లే చూపించిన ధర కాకుండా.. అత్యధిక ధర వేయడంతో సిబ్బందిని ప్రశ్నించారు. అరకిలో బాదంపప్పు ప్యాకెట్ డిస్ ప్లేలో రూ. 314 ఉండగా.. బిల్లింగ్ లో రూ. 345 వేశారు. ఏంటని ప్రశ్నిస్తే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని చెబుతున్నారన్నారు.
మరుసటి రోజు కూడా కొనుగోలు చేసేందుకు రాగా, ఓ సబ్బు బరువు ఒకటుంటే.. దాన్ని ఎక్కువ చూపిస్తూ డిస్ ప్లే చేశారని కస్టమర్ ఆరోపిస్తున్నారు. వినియోగదారులను డీ మార్ట్ సిబ్బంది లూఠీ చేస్తున్నారని, లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులు ఒకసారి తనిఖీ చేస్తే మరిన్ని మోసాలు బయటకు వస్తాయని కోరారు. తాను ముందు రోజు కొనుగోలు చేసిన బాదం పప్పు ప్యాకెట్లను మరుసటి రోజు ర్యాక్ నుండి తీసేశారని తెలిపారు. ఈ లెక్కన.. అరకిలో బాదం పప్పు ప్యాకెట్ మీద రూ. 31, కేజీకి రూ. 62 రూపాయల చొప్పున మోసం జరుగుతుందని వినియోగదారుడు అంటున్నారు. ఇలా డీ మార్ట్ సిబ్బంది ఎన్ని మోసాలు చేస్తున్నారో అంటూ వాపోయారు. దీనిపై సిబ్బందిని ప్రశ్నిస్తుంటే దురుసుగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.